YS Jagan: సింగయ్య మృతికేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు భారీ ఊరట..

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

YS Jagan

YS Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ సహా వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read: సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలించని వాతావరణం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో గత నెల 18న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ పర్యటన సమయంలో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. సింగయ్య మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

జగన్ కాన్వాయ్ కిందపడి అతను మరణించినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో జగన్‌ను ఏ2గా చేర్చారు. ఏ1గా జగన్ వాహన డ్రైవర్ రమణారెడ్డి, ఏ3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వర రెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడుదల రజిని తదితరులను చేర్చారు.

దీంతో రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ, ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాటన్నింటిని కలిపి హైకోర్టు విచారణ జరుపుతోంది.

నాలుగు రోజుల క్రితం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణను మంగళవారం (జులై1 వ తేదీ)కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ జరిగింది. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేసింది.