కుక్కలకు కెమెరాలు: రైల్వే నయా సెక్యూరిటీ సిస్టమ్

ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్‌కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వీటి ద్వారా తెలుసుకోగలమని అధికారులు చెబుతున్నారు. ఈ కుక్కలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కింద పనిచేస్తాయి. 

డాగ్ స్క్వాడ్‌ను నవీనీకరణం చేసే దిశగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్.. నాలుగు కెమెరాలను నాలుగు కుక్కలకు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. వీటితో పాటుగా మరో ప్రత్యేకమైన జాతి రెండు కుక్కలు కలవనున్నాయి. భారత రైల్వే నెట్‌వర్క్‌లో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. సీసీ టీవీ పర్యవేక్షణతో పోలీసులే కాకుండా సెక్యూరిటీ సిస్టమ్‌లో స్నిఫ్ఫర్ డాగ్స్ మరింత కీలకంగా వ్యవహరించనున్నాయి. 

వీటి ప్రత్యేకతలు:
* కుక్క కనుచూపు మేరలో ఏం కనిపించినా ఈ కెమెరాలు రికార్డు చేసేయగలవు. వీటిని హ్యాండిల్ చేసే వాళ్లు.. డాగ్స్‌తో పాటే ఉంటారు. మొబైల్ ఫోన్లలో వైఫై ద్వారా లాగిన్ అయి కెమెరాలను చూస్తూ ఉంటారు. ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఇట్టే పసిగట్టేస్తారు. 

* ఈ కెమెరాలు 170డిగ్రీల కోణం వరకూ తిరగడంతో పాటు, 16మెగా పిక్సెల్ కెమెరా, రెండు అంగుళాల స్క్రీన్, 4K-ultra high definition (HD)లాంటి ఫీచర్లతో వీడియో రికార్డు చేయగలదు.