విశాఖపట్నం టీడీపీలో గందరగోళం మొదలైంది. ఒక వర్గం ఎమ్మెల్యేలు రాజధాని ఏర్పాటు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుంటే.. కొందరు నాయకులు మాత్రం దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా రాజధాని ఏర్పాటుతో సాధ్యమవుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. జగన్ ప్రకటనను కొందరు సమర్థిస్తుంటే… మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో రాజధాని ప్రకటనతో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు జగన్ ప్రకటనకు మద్దతు తెలుపుతున్నారు.
నేతల ప్రత్యేక సమావేశం :
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తానన్న జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరంలోని ఓ హోటల్‌లో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం రాజధాని ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇదే విషయమై చర్చించేందుకు విశాఖకు చెందిన తెలుగు తమ్ముళ్లంతా సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వాసుపల్లి గణేశ్ కుమార్, గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు హాజరయ్యారు.
మరోవైపు విశాఖకు చెందిన సబ్బం హరి, శ్రీకాకుళానికి చెందిన కూన రవికుమార్ లాంటి టీడీపీ నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం సమర్థనీయం కాదంటున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గంటా తదితరులు సమావేశమయ్యారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, విశాఖ అభివృద్ధి చెందాల్సిన సమయం ఇదేనన్నారు. తమ నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, విశాఖ అర్బన్, రూరల్ పార్టీ అధ్యక్షులు, చంద్రబాబుపై ఈగ వాలనివ్వని వంగలపూడి అనిత, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పాల్గొనేలా గంటా శ్రీనివాసరావు చక్రం తిప్పారంటున్నారు.
బాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమేనా?
ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళితే రాజకీయాల్లో రాణించలేరని, జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతించకపోతే భావితరాలు మనల్ను క్షమించవని హితబోధ చేయడంతో మిగిలిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమేనన్న ప్రచారం సాగుతోంది. పార్టీ ఒకే నిర్ణయానికి ఫిక్సయిపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో విశాఖలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారితో ఇలా మాట్లాడిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులుగా లేని నేతలతో మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు కూడా రాజధానిగా విశాఖను పూర్తిగా వ్యతిరేకించడం లేదు.. అలా అని సమర్థించడమూ లేదు. మధ్యస్థంగా ఉంటూ.. రాజధాని రైతుల కోసమే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నదేనని జనాలు అనుకుంటున్నారు. విశాఖకు చెందిన సబ్బం హరి తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఉండగా… బండారు సత్యనారాయణమూర్తి మాత్రం న్యూట్రల్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారట.
ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం ప్రకారమే అంతా నడుస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. మరోపక్క వైసీపీ కూడా అదే అంచనాలో ఉందంటున్నారు. విశాఖకు చెందిన టీడీపీ నేతల వ్యవహారాన్ని నమ్మడానికి లేదని అధికార పార్టీ అనుకుంటోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనని చెబుతున్నారు.