దటీజ్ పవన్ కల్యాణ్.. దారుణ ఓటమిని విజయంగా మార్చుకున్న జనసేనాని

ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఏ మాత్రం అధైర్యపడకుండా... పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోకుండా అసలు లక్ష్యం వైపు అన్ని అడుగులూ వేశారు.

Pawan Kalyan : నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే.. అని సమాజం సహజ రీతుల గురించి మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ వివరించారు. ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన పవన్‌ కల్యాణ్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే పొగడ్తలకు ఆయన పొంగిపోలేదు. విమర్శలకు కుంగిపోలేదు. నడిచే దారిలో నలుగురు వచ్చిపోతుండడం ఎంత సహజమో… ఆశయ సాధనలో గెలుపోటములు కూడా అంతే సహజమని నమ్మారు.

ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఏ మాత్రం అధైర్యపడకుండా… పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోకుండా అసలు లక్ష్యం వైపు అన్ని అడుగులూ వేశారు. ఓటమిని విజయంగా మార్చుకోవడమెలాగో పుస్తకాల్లో చదివి తెలుసుకుని అంతటితో వదిలిపెట్టలేదు. తన రాజకీయ జీవితానికి అన్వయించి, ఆచరించి అనుకున్నది సాధించారు. తాను ఎక్కడైనా పవరర్‌ స్టార్‌నే అని నిరూపించుకున్నారు.

తనకు తానుగా రాసుకున్న చరిత్ర…
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి పవన్ కల్యాణ్ ఎంతగా ఎదురుచూశారో.. అంతకు కొన్ని లక్షల రెట్లు… అభిమానులు, కార్యకర్తలు ఏళ్ల తరబడి నిరీక్షించారు. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం రోజు మెగా కుటుంబం ఎంత సంబరంలో మునిగిపోయిందో…. ఆయన అభిమానగణం మొత్తం అంతే ఆనందంతో వేడుకలు చేసుకుంది. అది పవన్ కల్యాణ్ తనకు తానుగా రాసుకున్న చరిత్ర. తాను మాత్రమే రాయగల చరిత్ర.

దారుణ పరాజయాన్ని, చరిత్రలో నిలిచిపోయే గెలుపుగా మార్చుకున్న పవన్..
పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, అందరి సహకారం లభించినప్పుడు, సకల అస్త్రాలు సిద్ధంగా ఉన్నప్పుడు, అంచనాలు లేనప్పుడు విజయాన్ని సాధించడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎవరైనా చేయగలరు. కానీ పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య, ఎవరి తోడ్పాటూ లేని చోట, ఆకాంక్షలు, అంచనాల భారం పెరిగిపోయినప్పుడు… దారుణ పరాజయాన్ని, చరిత్రలో నిలిచిపోయే గెలుపుగా మార్చాలంటే అపార ధైర్యసాహసాలు, ఓటములకు చలించని ధీరత్వం, మొక్కవోని పట్టుదల, పరిస్థితులను మార్చివేయగల శక్తిసామర్థ్యాలు, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయగల అసాధారణ ముందుచూపు, అంతే లేని ప్రజాకర్షణ వీటన్నింటికీ మించిన స్థితప్రజ్ఞత కావాలి.

జనసేనానికి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయని 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. 2019లో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన పార్టీని 2024 ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసి…. నిలబడ్డ అభ్యర్థులందరినీ గెలిపించి వందశాతం విజయం సాధించిన స్థితిలో నిలబెట్టడం ద్వారా పవన్ తన రాజకీయ భవిష్యత్తును, జనసేన దశనే కాదు.. రాష్ట్రానికే దిశానిర్దేశం చేశారు.

గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఎత్తులు పై ఎత్తులు..
వందశాతం విజయం సాధించిన పార్టీగా జనసేనను మార్చే క్రమంలో పవన్ అనేక రాజకీయ సమీకరణాలు చేశారు. పొత్తుల ప్రయోగాలతో సరికొత్త రాజకీయం సృష్టించే ప్రయత్నం చేశారు. జనం నాడి తెలుసుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేశారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న.. పవన్.. ఎవరి అంచనాలకు అందని రీతిలో కొత్త పొత్తులు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా ఆలోచనలు చేసిన పవన్…ఎవరిని కలుపుకుపోతే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఊహించారు. పవన్ అంచనాలన్నీ నిజమని, ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టుగానే ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ఆ నిర్ణయాలన్నింటితో ఉమ్మడి ప్రయోజనం దక్కుతుందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ఏకంగా ప్రధాని మోదీతో ప్రశంసలు పొందిన పవన్..
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం పవన్ రచించిన వ్యూహాలు ఏపీ ఎన్నికల ఫలితాలనే కాదు.. దేశ రాజకీయాలనూ శాసిస్తున్నాయి. ఎన్డీఏలో టీడీపీ ప్రధాన పాత్రగా మారడం వెనుకున్నది పవనే. అందుకే ఇప్పుడాయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో పవర్‌ స్టార్. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో పవన్‌ను తుఫాన్‌తో పోల్చారంటే.. ఆయన పొలిటికల్ స్టామినా ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.

గెలుపు భయాన్ని కల్పించిందన్న గొప్ప నాయకుడు..
పవన్ మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. పవన్ రాజకీయ ప్రసంగాల్లో యువతకు భారీ ఆదరణ ఉంది. యూత్‌కే కాదు.. తల పండిన రాజకీయ నేతలు సైతం పవన్ ప్రసంగాలను, గెలుపు తర్వాత ఆయన అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. పొలిటికల్ పవర్‌ స్టార్‌నని నిరూపించుకున్న పవన్.. ఇక పాలనపై తన మార్క్ చూపించనున్నారు. గెలుపు ఆనందాన్ని కాకుండా భయాన్ని కల్పించిందని చెప్పిన పవన్… అంతే బాధ్యతతో పని చేస్తానని అందరికీ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినవన్నీ చేస్తానన్నారు. అంతేకాదు..పవన్ ఎన్నికల ప్రసంగాలకు, గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలకు మధ్య స్పష్టమైన తేడా కనిపించింది. ఎన్నికల ప్రచార సభల్లో ఎవరైనా లెక్కలేదన్న తరహాలో ఉన్న పవన్ మాటలు…. విజయం తర్వాత అందరినీ కలుపుకుపోయే నాయకుడిలా మారాయి.

ఎవరితోనూ తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదంటున్న పవన్… ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్నారు. ఇన్నాళ్లూ ఓ రాజకీయ పార్టీ నేతగా, ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా సరికొత్త హోదాతో ప్రజల కోసం పని చేయనున్నారు.

Also Read : అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!

ట్రెండింగ్ వార్తలు