అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!

విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!

Cm Chandrababu Focus On Tirumala : కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. టీడీటీతోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు…. అన్నది చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీటీడీకి కొత్త ఈవోను నియమించారు.

అలా బాధ్యతలు చేపట్టారో లేదో ఇలా ప్రక్షాళన చర్యలు ప్రారంభించారు ఈవో శ్యామలరావు. విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏడుకొండలపై ఎలాంటి అపచారాలు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

ఐదేళ్లుగా తిరుమల పరిస్థితులపై అనేకానేక ప్రచారాలు..
శ్రీ వేంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఎప్పుడూ భక్తజనసంద్రంగా ఉండే తిరుమలగిరుల్లో హరినామస్మరణ మారుమోగుతుంటుంది. ఓం నమో వెంకటేశాయ అన్న అష్టాక్షరి మంత్రం ప్రతిధ్వనితో అణువణువూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ఏడు కొండలవాడా వెంకటరమణా.. గోవిందా… గోవిందా అంటూ భక్తులు చేసే స్వామి స్మరణ పుణ్యక్షేత్రాన్ని పులకింప చేస్తుంటుంది. అయితే గత ఐదేళ్లుగా తిరుమల పరిస్థితులపై అనేకానేక ప్రచారాలు జరిగాయి.

తిరుమలకొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన..
టీటీడీ అక్రమాలపై రోజుకో వార్త వచ్చింది. ఎన్నో కష్టనష్టాల కోర్చి తిరుమలకు వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు ఉండడం లేదని, క్యూలైన్లు మొదలుకుని భక్తులు బస చేసే గదుల వరకు అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అన్నప్రసాదం, తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని, తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమలకొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

తప్పు చేసిన వాళ్లను ప్రక్షాళన చేయాల్సిందే..
ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం తిరుమల ప్రక్షాళన చేపడతామని ప్రకటించింది. ఈ నెల 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. అదే రోజు తిరుమల పర్యటనకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమలపై కీలక ప్రకటనలు చేశారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. తప్పు చేసిన వాళ్లను ప్రక్షాళన చేయకపోతే దేవుడు కూడా సహకరించడని, మంచివాళ్లను కాపాడుకోవాలని, చెడు వ్యక్తులను శిక్షించాలని అన్నారు. తిరుమలలో అదే సంకల్పం తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు.

తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదని, ఏడుకొండలవాడా, ఓం నమో వెంకటేశాయ నినాదాలు తప్ప తిరుమల గిరుల్లో మరేమి వినిపించకూడదని హెచ్చరించారు. ఏదైనా తప్పు చేస్తే వేరే దేవుళ్లు మరో జన్మలో శిక్షిస్తారేమోగానీ.. శ్రీనివాసుడికి అపచారం చేయాలని భావిస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని, అనుభవించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చెప్పినట్టుగానే టీటీడీ ప్రక్షాళన ప్రారంభం..
తిరుమల స్వామివారిని దర్శించుకుని.. అమరావతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పినట్టుగానే టీటీడీ ప్రక్షాళన ప్రారంభించారు చంద్రబాబు. టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. ఈ నెల 16న టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తొలుత వరాహస్వామివారిని దర్శించుకున్న శ్యామల రావు ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా సేవ చేస్తానని తెలిపారు. తిరుపతిలోనూ, తిరుమల కొండపైనా ప్రతి ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, సంప్రదాయానికి పెద్దపీటవేసేలా, బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరుక్షణమే రంగంలోకి దిగిన ఈవో… అక్రమాలు, అవినీతిపై, అక్రమార్కులపై కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు.

భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలన..
నారాయణ గిరి సర్వదర్శనం క్యూ లైన్లలో తనిఖీలు నిర్వహించారు. సర్వ దర్శనం క్యూలైన్లలో పారిశుద్ధ్య లోపంపై సూచనలు చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈవో క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. ఆ సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దర్శనం టోకెన్లు, అన్నప్రసాదాలు, పాలు సరఫరా వంటివి పూర్తిస్థాయిలో జరగడం లేదని భక్తులు చెప్పడంతో మెరుగైన సౌకర్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులకు సౌకర్యాల కల్పన సహా అన్ని అంశాలనూ పరిశీలిస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read : భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?