శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

  • Publish Date - July 30, 2020 / 02:31 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం గం.9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు. అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేస్తారు. కాగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ….సాలకట్ల పవిత్రోత్సవాలు జరుగుతున్నప్పటికీ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు య‌థావిధిగా ఉంటుందన్నారు. స్వామివారి అనుగ్ర‌హంతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి  ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

ప్ర‌తి ఏడాది తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించ‌డం అన‌వాయితీగా వ‌స్తోందన్నారు. ఇందులో భాగంగా గురు‌వారం ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయిన‌ట్లు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ చ‌ర్య‌ల‌లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.