పోతిరెడ్డి పాడు ముందుకే…స్టే వచ్చినా టెండర్లకే జగన్ రెడీ!

  • Publish Date - May 20, 2020 / 11:17 AM IST

పోతిరెడ్డి పాడుపై ముందుకే వెళ్లడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సామర్థ్యం పెంచే విషయంలో జగన్ సర్కార్ పట్టుదలతో ఉండడంతో ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి దారి తీసింది. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించడం హాట్ టాపిక్ అయ్యింది. విస్తరణ పనులపై ఇచ్చిన స్టేను ఏపీ సర్కార్ ఎదురు దెబ్బగా భావించడం లేదు. పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ విస్తరణ చేపట్టాలంటే తీసుకోవాల్సిన అనుమతుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

పథకానికి సంబంధించిన పనులను ఎందుకు విస్తరిస్తున్నామో నివేదించి, పర్యావరణపరంగా గ్రీన్ ట్రిబ్యునల్‌కున్న అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత, పకడ్బందీగా వాదనను వినిపించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ట్రిబ్యునల్ అభ్యంతరాలన్నీ టెక్నికల్ మాత్రమే..రాష్ట్రాలమధ్య జల సంబంధాల గురించి కాదని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ప్రాజెక్ట్‌కు ఇది సాధారణమేనని, ప్రస్తుతానికి ప్రాజెక్ట్ జీవో స్టేజ్‌లో ఉండం..టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలోపే ట్రిబ్యునల్ ను ఒప్పించగలమని ప్రభుత్వం నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. 

ఇప్పటికే రెండు ప్యాకేజీల్లో టెండర్లను పిలవడానికి సిద్ధమవుతున్నసమయంలో ఎన్జీటీ స్టే వచ్చింది. అయినా వెనక్కు తగ్గవద్దని, స్టే ఎత్తివేసేలోగా మిగిలిన పనులు, ప్యాకేజీ ఖరారు, టెండర్ ప్రక్రియ, భూసేరకణ విషయాల్లో ముందుకెళ్లడానికే ప్రభుత్వం చొరవచూపుతోంది. ఈలోపే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మధ్యంతర ఉత్తర్వుల కోసం సిద్ధమవుతోందని తెలుస్తోంది. 

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందుకోసం న్యాయ పోరాటం కూడా చేస్తామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ తరపున ఫిర్యాదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్నిపెంచుతూ ఉత్తర్వులిచ్చింది. హెడ్‌రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44వేల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచింది. వెంటనే తెలంగాణ ప్రతిస్పదించింది. అందుకే మే 13న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

Read: రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు: సుప్రీంకోర్టు