వ్యూహాత్మకంగా ఒక్క ఖాళీని వదిలేసిన చంద్రబాబు.. మంత్రి పదవిపై జనసేన, బీజేపీ నేతల ఆశలు

అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు చాలా మంది మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆ ఒక్కటి ఎందరినో ఊరిస్తోంది… ఆ ఒక్కటి మూడు పార్టీల్లో ఆసక్తి రేపుతోంది. ఆ ఒక్కటి ఆశావహులను అటెన్షన్‌లో పెడుతోంది. ఆ ఒక్కటిపై ఆత్రుత.. పనివున్నా, లేకున్నా అమరావతి చుట్టూ తిప్పుతోంది. ఆ ఒక్కటి పదవుల్లో ఉన్నవారినీ టెన్షన్‌ పెడుతోంది. ఇంత మందిని ఎట్రాక్ట్‌ చేస్తున్న ఆ ఒక్కటి సస్పెన్స్‌ ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. అధినేత అంతరంగంలో ఏముందో తెలియక చివరికి సీనియర్‌ మోస్ట్‌ లీడర్లు సైతం ఆ ఒక్కటీ అడగొద్దు అంటున్నారు? ఇంతకీ ఆ ఒక్కటీ ఏంటట? అనుకుంటున్నారా? ఐతే ఈ పొలిటికల్‌ స్టోరీ చూడాల్సిందే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… ఏది చేసినా దానికో లెక్క ఉంటుంది… డిప్యూటీ సీఎం పవన్‌ సినీ డైలాగ్‌ నాకో లెక్కంటుంది… గుర్తు చేసేలా చంద్రబాబు యాక్షన్‌ ఎప్పుడూ సస్పెన్స్‌గానే ఉంటుంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం చంద్రబాబు… తొలిసారే 24 మందిని తన క్యాబినెట్‌లోకి చేర్చుకున్నారు.

25 మందిని చేర్చుకోవచ్చు..
సంఖ్యాపరంగా ఏపీ క్యాబినెట్‌లో 25 మందిని చేర్చుకోవచ్చు. కానీ, చంద్రబాబు వ్యూహత్మకంగా ఒక్క ఖాళీని వదిలేశారు. ఇలా ఆ ఒక్కటి ఎందుకు భర్తీ చేయలేదని మంత్రివర్గం కొలువుదీరిన నుంచి ఇప్పటివరకు తెలుగు తమ్ముళ్లు చెవులు గొణుక్కుంటున్నారు. ఇక మంత్రి పదవులు రాని లీడర్లు అయితే తమ కోసమే ఆ ఖాళీ ఉంచేశారని ఆశతో కాలం గడిపేస్తున్నారు. కానీ, బాబు వ్యూహం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

క్యాబినెట్‌లో ఒక్క ఖాళీ వదిలేయడంతో ఇటు టీడీపీ… అటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆశావహుల లెక్క చెప్పమంటే వన్ ఈస్ హండ్రెడ్ అబౌ అన్నటుగా… వంద మందికి పైనే మంత్రి పదవి కోసం కలలు కంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేలతోపాటు కొందరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్సీ హామీతో ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన సీనియర్లు ఉన్నారు. దీంతో చంద్రబాబు క్యాబినెట్‌ బెర్త్‌ను ఎప్పుడు పూర్తిస్తారా? అని అంతా ఎదురుచూసేలా ఆ ఒక్క ఖాళీ ఊరిస్తోంది.

చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఆయన అన్ని మంత్రి పదవులూ ఇచ్చేసి మరీ ఒక్క బెర్త్‌ని అలా ఉంచడం దేనికి సంకేతం మంటూ మరికొంతమంది నేతలు చర్చించుకుంటున్నారు. అసలు ఎవరి కోసం ఆ ఒక్క బెర్త్‌ను పెండింగ్‌లో ఉంచారనేది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి 164 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో 24 మంది ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. మరికొందరికి ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌ పదవులు కట్టబెట్టనున్నారు. ఐతే ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవిపై పలువురు సీనియర్లు కన్నేశారు. సీఎంపై ఒత్తిడి పెంచేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు చాలా మంది మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జిల్లా నుంచి కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్‌ కూడా బెర్త్‌ ఆశిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం నుంచి కళావెంకటరావు, విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు మంత్రి చాన్స్‌ రాకపోదా? అనే ఆశతోనే కాలం గడుపుతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల నుంచి?
ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇప్పటికే ఎక్కువ మందికి ప్రాధాన్యం కల్పించగా, సీనియర్‌ నేత రఘురామకృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్‌ తమ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి దేవినేని ఉమా, మండలి బుద్ధప్రసాద్‌, ధూళిపాల్ల నరేంద్ర, ఆలపాటి రాజా కూడా గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు.

ఉమా, రాజా పొత్తుల్లో తమ సీట్లను త్యాగం చేశారు. వీరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ ఇద్దరూ మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందిన కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల జయప్రకాశ్‌రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి వంటివారూ అవకాశం ఇవ్వకపోతారా? అన్నట్లే ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీ, జనసేన కూడా మరో మంత్రి పదవిని ఆశిస్తున్నాయి. ఇంతమందిని ఆశగా ఎదురుచూసేలా చేసిన ఆ ఒక్క ఖాళీ.. సిట్టింగ్‌ మంత్రులను సైతం భయపెడుతోందట… ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల ఫెర్ఫార్మెన్స్‌ సరిగా లేకపోతే విస్తరణలో ఊస్టేంగేనని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీంతో ఆ ఒక్కఖాళీ ఉండటం వల్ల ఎప్పుడైనా విస్తరణ జరిగే అవకాశం ఉందని… దీంతో తమ పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందేమోనని మంత్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఉంచిన ఒక్క ఖాళీ అందరినీ అటెన్షన్‌లో పెడుతోందంటున్నారు.

Also Read: తెలంగాణలో బలపడేందుకు టీడీపీ పక్కా వ్యూహం? ఆ పార్టీలోకి నామా?

ట్రెండింగ్ వార్తలు