Strict restrictions on New Year celebrations in AP : తెలుగు రాష్ట్రాల్లో 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్‌లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా కనపడవు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని, సురక్షితంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. తాగి వాహనాలు నడపడం, కొత్త సంవత్సరం వేడుకల నిబంధనలు పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండడంతో విశాఖలో న్యూ యర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా హోటళ్లు, పంక్షన్ హాళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఈ ఏడాది అనుమతి ఇవ్వడం లేదు. ప్రతి ఏటా న్యూ ఇయర్ వేడుకలు విశాఖలో ఉల్లాసంగా సాగుతాయి. బీచ్ రోడ్డులో పండగ వాతావరణం ఉంటుంది. కానీ ఈ ఏడాది ప్రజలంతా ఇళ్లకే పరిమితం కానున్నారు. బీచ్‌రోడ్డులోకి వాహనాలకు, సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి ఎనిమిది గంటల వరకూ, బార్లు రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉండనున్నాయి. కరోనా నిబంధనల ప్రకారం అమ్మకాలు జరపాలని పోలీసులు ఆదేశించారు. 21 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారికి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాల్లో కూడా కరోనా నిబంధనలు అమలుచేయనున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో డ్యాన్సులు వంటివి నిషిద్ధమని పోలీసులు తెలిపారు. రోడ్లపై కేక్‌లు కట్ చేయడం, ఎక్కువమంది గుమికూడడం, శుభాకాంక్షలు పేరుతో మహిళలను వేధించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపై బిగ్గరగా అరవడం, అల్లర్లకు పాల్పడడం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చినా చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బయటకు వెళ్లితే ప్రమాదం…. ఇంట్లో ఉంటే సురక్షితం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని…నగరవాసులు పోలీసులకు సహకరించాలని సిపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.
విజయవాడలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సంవత్సరం న్యూఇయర్ వేడుకలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ రాత్రి బెంజిసర్కిల్, కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద రాకపోకలను నిషేధించారు. వ్యాపార సంస్థలు, ఇతర షాపులు, రాత్రి పదిగంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.