Supreme Court: ఇక్కడ పెళ్లి.. విదేశాల్లో విడాకులా? ఎన్ఆర్ఐ భర్తలకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
భారత్‌లో పెళ్లి చేసుకుని, విదేశీ కోర్టులలో విడాకులు పొందే ధోరణిపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
supreme court rules on foreign divorce and hindu marriage act
- భారత్‌లోనే విడాకులు తీసుకోవాలి
- విదేశీ తీర్పు చెల్లదన్న సుప్రీంకోర్టు
- హిందూ చట్టంతోనే పెళ్లిళ్ల రద్దు
Supreme Court: భారత్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని, విదేశీ కోర్టులలో విడాకులు పొందే ధోరణిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ దంపతుల వివాహ వివాద కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల తీర్పుల చెల్లుబాటుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి 2003లో వివాహం చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ బాబు పుట్టిన తర్వాత, సత్తెనపల్లి కోర్టులో విడాకుల పిటిషన్ వేయగా అది కొట్టివేతకు గురైంది. దీంతో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని యూకేలోని కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టు ద్వారా 2014లో విడాకుల డిక్రీ పొంది, మరో మహిళను వివాహమాడారు. దీనిపై మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో బహుభార్యత్వా కింద క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని శ్రీధర్‌రెడ్డి సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ, “భారతీయ హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన పెళ్లిళ్లను అదే చట్టం కింద మాత్రమే రద్దు చేయాలి తప్ప, విదేశీ కోర్టులలో విడాకులు తీసుకోవడం కుదరదు” అని స్పష్టం చేసింది. విదేశాల్లో ఏదో ఒక కాగితం చూపించి విడాకులు పొంది, అక్కడే మరో పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఉన్న మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.
