Chandrababu Cases Update : చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్ కు బెయిల్ ఎందుకివ్వరని లూథ్రా ప్రశ్నించారు. Chandrababu Cases

Supreme Court On Chandrababu Cases

Supreme Court On Chandrababu Cases : చంద్రబాబు కేసుల విచారణ మరోసారి సుప్రీంకోర్టులో వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మంగళవారం(అక్టోబర్ 17) మధ్యాహ్నం 2గంటలకు విచారణ చేస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు. క్వాష్ పిటిషన్ పై ఇవాళ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నేరం ఐదేళ్ల కిందట జరిగినా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని చెప్పారు. 17ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదని వాదించారు.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే మంగళవారం కొనసాగిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసులోనూ 17ఏ పరిగణలోకి తీసుకోలేదని చంద్రబాబు లాయర్ లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్ కు బెయిల్ ఎందుకివ్వరని లూథ్రా ప్రశ్నించారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లు మంగళవారానికి వాయిదా పడ్డాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున గంటన్నర పాటు వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి.

”చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ వర్తించదు. సెక్షన్ 17ఏ జూలై 2018లో వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ నేరం 2015, 2016 నుండే ఉన్నాయి. సెక్షన్ 17A ప్రయోజనం ఏదీ ఈ కేసుకి ఇవ్వబడదు. ఎందుకంటే గతంలో నమోదైన కేసులకు ఇవ్వాలని చట్టంలో పేర్కొనలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలను విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నవని లేదా సిఫార్సులని పరిగణించలేము.

Also Read : జైల్లో నా భర్తకు అవసరమైన అత్యవసర వైద్యం సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలం : నారా భువనేశ్వరి

నిజాయితీ గల అధికారులకు ఒక మోస్తరు రక్షణ కల్పించడమే లక్ష్యంగా సెక్షన్ 17A ఉంది. 17ఏ రాకముందు జరిగిన నేరాలకు 17ఏ వర్తించదు. ఇదే అభిప్రాయాన్ని అనేక హైకోర్టులు స్పష్టం చేశాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేకుంటే, సెక్షన్ 17ఏ ని ఎందుకు అమలు చేయాలంటున్నారు? చంద్రబాబు తనకు దానితో సంబంధం లేదని చెబుతున్నట్లయితే, అధికారిక విధి నిర్వహణలో ఎలా చెప్పగలరు? నేనే చేశానని చెబితే మాత్రమే సెక్షన్ 17A వర్తిస్తుంది.

చంద్రబాబు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ప్రారంభించబడిందనే వాస్తవాన్ని 14.05.2018 05.06.2018 నాటి రెండు పత్రాల ద్వారా నిరూపించవచ్చు. ఈ పత్రాలు హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వబడ్డాయి. హైకోర్టు న్యాయమూర్తి కూడా వాదనలను అంగీకరించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు.

టెండర్లు లేకుండా ఒప్పందాలు జరిగాయి. రూ.370 కోట్లను రెండు కంపెనీలకు పంపారు. అందులో కొంత డబ్బును షెల్ కంపెనీలకు పంపారు. తప్పు జరిగింది. విచారణ జరపాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడటం లేదు” అని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కాగా, తన వాదనలకు మరో అరగంట సమయం కావాలని ఆయన కోరడంతో తదుపరి విచరణ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు

ఇక, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. పీటీ వారంట్ ప్రకారం చంద్రబాబు ని ఏసీబీ కోర్టులో సోమవారం హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే బాబుని అరెస్ట్ చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా చెప్పారు. అయితే, సోమవారం చంద్రబాబు అరెస్ట్ ఉండదని సీఐడీ తరపున హామీ ఇచ్చారు ముకుల్ రోహత్గి. లేదంటే ట్రయల్ కోర్టులో కేసు విచారణను వాయిదా వేయాలని కోరతామన్నారు.

ట్రెండింగ్ వార్తలు