Lokesh (1)
Nara Lokesh Narasaraopet tour : గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొలననుంది. ఇవాళ నారా లోకేశ్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గత ఫిబ్రవరి 24న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనకు రెడీ అయ్యారు. అనూష కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పాలని నిర్ణయించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి.. 11 గంటలకు నరసరావుపేటకు చేరుకోనున్నారు లోకేశ్. అనూష కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అయితే నారా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా… లోకేశ్ పర్యటనకు అనుమతించడం లేదని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. అనూష హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని… కుటుంబానికి ప్రభుత్వం పరిహారం కూడా అందజేసిందన్నారు.
ఈ కేసులోచార్జిషీట్ దాఖలు చేశామని.. ట్రైల్‌కు కూడా కేసు వచ్చిందని తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయాల కోసం నారా లోకేశ్ నరసరావుపేటకు రావడం అవసరమా అని అన్నారు ఎస్పీ విశాల్ గున్నీ. పాత కేసులతో రాజకీయాలు చేయవద్దని సూచించారు.
నారా లోకేశ్ నరసరావుపేటకు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. నరసరావుపేట ప్రశాతంగా ఉండటం లోకేశ్‌కు ఇష్టంలేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనకు వస్తున్నారన్నారు. రాజకీయ మనుగడ కోసం నరసరావుపేటలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తామంటే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.