TDP AP bandh
TDP AP bandh – Chandrababu Jailed : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు తరలించడంపై టీడీపీ భగ్గుమంటోంది. దీనికి నిరసనగా ఇవాళ (సోమవారం) రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. రాజకీయ కక్షతో చేసిన చంద్రబాబు అరెస్టును బంద్ ద్వారా ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ చేయనున్నట్లు తెలిపింది.
అత్యవసర సేవల వారు మినహా మిగతా వర్గాలన్నీ బంద్ కు సహకరించాలని కోరింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ బద్ పాటించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ జగన్ రెడ్డి కక్ష పూరిత రాజకీయాలకు నిరసనగా బంద్ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా స్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ బంద్ కు సీపీఐ, జనసేన మద్దతు తెలిపాయి. జనసేన శ్రేణులు బంద్ లో శాంతియుతంగా పాల్గొనాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. బంద్ కు మద్దతు తెలిపిన సీపీఐ.. సంఘీభావంగా ఇవాళ విజయవాడలో జరగాల్సిన ఆ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాయిదా వేసింది.
మరోవైపు టీడీపీ బంద్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని హుకుం జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.