Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానన్న టీడీపీ అధినేత

ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు.

Chandrababu Naidu

Chandrababu Visits Tirumala Tirupathi : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు దంపతులకు అందజేశారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఇదిలాఉంటే.. రేపు (శనివారం) విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకుంటారు.

Also Read : Chandrababu Naidu : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఎంపీలతో భేటీ

చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీవారి పాదపద్మాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని అన్నారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారు. ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలేకాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు.. ఇక్కడ ఒకే గోవింద నామస్మరణ తప్ప వేరే ఉండటానికి వీల్లేదు.. మిగిలిన విషయాలు త్వరలో మాట్లాడతానని అన్నారు. ప్రజలకోసం 45 సంవత్సరాలుగా ప్రపంచంలో మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ భారతీయులకు అవి అందించాలని ప్రయత్నించానని చెప్పారు. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చిందని, భవిష్యత్తులో భారతీయులతోపాటు ప్రపంచంలో అన్ని రంగాల్లో నెం.1 స్థానంలో తెలుగు కమ్యూనిటీ ఉండాలని, ఆమేరకు నా ప్రయత్నం ఉంటుందని చంద్రబాబు చెప్పారు.

Also Read : Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్‌ డ్యాం వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం.. భారీగా చేరుకుంటున్న తెలంగాణ పోలీస్ బలగాలు

తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. ఈరోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు టీడీపీ ఎంపీలతో చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టే విషయమై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు