Chandrababu
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తన ఇంట్లోని వాళ్లపైనా అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ విషయంపై.. తన ఛాంబర్లో అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశాన్ని సైతం నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం తన నిర్ణయాన్ని సభలో వెల్లడించారు.
వైసీపీ సభ్యులు శృతి మించి వ్యవహరిస్తున్నారని అన్నారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పారు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అంతకుముందు.. టీడీపీఎల్పీ సమావేశంలోనూ ఆయన ఆవేదనకు గురయ్యారు. ఓ దశలో.. చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. పార్టీ నేతలు ఆయనను సముదాయించారని.. సమాచారం. చివరికి సభకు వెళ్లిన చంద్రబాబు.. తన నిర్ణయాన్ని వెల్లడించి.. సభ్యులందరికీ నమస్కరిస్తూ బయటికి వెళ్లిపోయారు.