CM Chandrababu Naidu
TDP High Command : మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ల అంశం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశం కూటమిలో దుమారానికి దారితీసింది. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే అంశంపై ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.
వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దు..
లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది.
Also Read : కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై కార్మికుల్లో అనుమానాలు: బొత్స సత్యనారాయణ
లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ప్రతిపాదనలు..
నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీలో కొంతమంది మాట్లాడుతున్నారు. దీంతో ఈ అంశం కూటమిలో రచ్చకు దారితీసింది. ఈ వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. వెంటనే హైకమాండ్ స్పందించింది. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టింది. మొన్న కడప పర్యటనలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా బహిరంగ వేదికలపై తొలిసారిగా ఈ అంశాన్ని లేవనెత్తారు.
టీడీపీ నేతలపై హైకమాండ్ సీరియస్..
కష్టకాలంలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసిన నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత రఘురామకృష్ణ రాజు, పలువురు మంత్రులు, పార్టీ సభ్యులు దీనిపై మాట్లాడారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
వ్యక్తిగత అజెండాలతో మాట్లాడటం సరికాదు..
ఇటువంటి చర్చ ఇప్పుడు అనవసరం అని తేల్చి చెప్పింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమిలో అందరం మాట్లాడి తీసుకుంటారని స్పష్టం చేసింది. ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం, వ్యక్తిగత అజెండాలతో మాట్లాడటం సరికాదని టీడీపీ హైకమాండ్ చెప్పింది.
కూటమి ముందున్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం. ఆ దిశగా పని చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ఇటువంటి ప్రచారాలు, ఇటువంటి డిమాండ్లు సరికాదని, ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అంతర్గతంగా పై నుంచి కింది స్థాయి వరకు అందరికీ ఇదే మేసేజ్ ను హైకమాండ్ పంపించింది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది.
Also Read : క్రమశిక్షణ కమిటీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు