టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన

తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.

TDP Janasena 1st List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ, జనసేన పార్టీలు శనివారం విడుదల చేశాయి. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, జనసేన ఐదుగురు అభ్యర్థులను పేర్లను ఖరారు చేసింది. తమ పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మిగతా అభ్యర్థులను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కాగా, టీడీపీ టికెట్లు ఆశించిన భంగపడిన పలువురు నాయకులు నిరసనలు దిగుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ఆందోళలు రేగాయి.

కళ్యాణదుర్గంలో భగ్గుమన్న అసమ్మతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ ను అమిలినేని సురేందర్ బాబుకు కేటాయించడంతో అసమ్మతి రేగింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం నిరసనకు దిగింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ ఉన్నం వర్గీయులు నినాదాలు చేశారు. 40 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేసిన వారిని కాదని బయటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డబ్బుకు చంద్రబాబు అమ్ముడు పోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. కళ్యాణదుర్గంలో టీడీపీని కచ్చితంగా ఓడించి తీరుతామని ఉన్నం వర్గీయులు అంటున్నారు.

గజపతినగరం టీడీపీలోనూ..
విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీలో అసమ్మతి రగిలింది. గజపతినగరం నియోకవర్గ ఇంచార్జ్ కొండల్లి అప్పల నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గజపతినగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావును ప్రకటించడంతో అప్పల నాయుడు మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికలను బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలంటూ అప్పల నాయుడుపై ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై కేడర్ తో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు.

Also Read: 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థుల ప్రకటన.. ఎందుకంటే?

రాయచోటిలో రగిలిపోతున్న రమేశ్ కమార్ రెడ్డి వర్గీయులు
అన్నమయ్య జిల్లా రాయచోటి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో నియోజకవర్గ రమేశ్ కమార్ రెడ్డి మద్దతుదారులు రగలిపోతున్నారు. టీడీపీ జెండాలు, ప్రచార పత్రాలు దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ వర్గీయులు కూడా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. కాగా, ఎవరినీ సంప్రదించకుండా అనాలోచిత నిర్ణయంతోనే చంద్రబాబు రాయచోటి అభ్యర్థిని ఖరారు చేశారని రమేశ్ కమార్ రెడ్డి విమర్శించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే సహకరించబోనని చంద్రబాబుతో స్వయంగా చెప్పినట్టు వెల్లడించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు