TDP-Janasena First List : 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థుల ప్రకటన.. ఎందుకంటే?
జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. అయితే, ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు.
- Harishth Thanniru
- Updated on- February 25, 2024 / 12:10 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి జాబితాలో టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. అయితే, ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుందని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ కలిసివస్తే వారికి కేటాయించే స్థానాలు పోను మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.. సిద్ధం అని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. మేం యుద్ధానికి సంసిద్ధం. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేము కలిసి పోటీ చేస్తున్నామని పవన్ చెప్పారు. సీట్ల కేటాయింపు విషయంలో చాలా మంది 60 లేదా 70 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సూచనలు చేశారు. గతంలో 10 సీట్లనైనా జనసేన పార్టీ గెలిచి ఉండుంటే ఆ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబును అడిగేందుకు వీలుండేది. అయినా, ఇప్పుడు సీట్లు ముఖ్యం కాదు.. పరిమిత సంఖ్యలో పోటీచేసి స్ట్రైక్ రేట్ గెలుపులో చూపించాలని ఉందని పవన్ అన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించుకుంటున్నామని పవన్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ అన్నారు. జనసేనకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని పవన్ చెప్పారు.
Also Read : YCP : భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..!
మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..?
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 24 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ (తెనాలి), లోకం మాధవి (నెల్లిమర్ల), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బత్తుల బలరామ కృష్ణ (రాజానగరం), పంతం నానాజీ (కాకినాడ రూరల్) అభ్యర్థిత్వాలను పవన్ ప్రకటించారు. మిగిలిన 19స్థానాల్లో అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉంది. అయితే, వీటిలో ఏఏ నియోజకవర్గాలు ఉన్నాయనే విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. సామాజిక వర్గాల వారికి నియోజకవర్గాలను పవన్ కల్యాణ్ ఎంపిక చేసుకోనన్నట్లు తెలుస్తోంది. బీజేపీకూడా జనసేన – టీడీపీ కూటమిలో కలిసే అవకాశం ఉండటంతో.. బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచే అసెంబ్లీ నియోజకవర్గాలపై స్పష్టత వచ్చిన తరువాత జనసేన మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
