TDP leader Nara Lokesh Visited Tirumala
TDP leader Nara Lokesh Visited Tirumala : ‘యువగళం’ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు టీడీపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. గురువారం (జనవరి 26,2023) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా లోకేశ్ కుప్పంలో తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. లోకేశ్ తిరుమల రాకతో తిరుపతిలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుపతి చేరుకున్నారు. లోకేశ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తిరుమల స్వామి వారిని దర్శించుకున్న లోకేశ్.. కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు.
27 మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మునిసిపాలిటీ లక్ష్మీపురంలోని వరదస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. పిల్లనిచ్చిన మామ, టీడీపీ నేత,హిందూపురం ఎమ్మెమ్మెల్యే బాలకృష్ణ లోకేశ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాద్రయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.ఆ తరువాత గుడుపల్లె మండలం శెట్టిపల్లి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడికల్ కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకేశ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడి నుంచి శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు.
కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రకు ఇప్పటికే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు,నేతలతో కుప్పం అంతా పసుపు మయంగా మారిపోయింది. బహిరంగ సభకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు. యువగళం పాదయాత్రకు సంఘీభావంగా కుప్పంలో తెలుగు యువతు ర్యాలీ నిర్వహించనున్నారు. కోలాహలం మధ్య లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది.