Ap Political
AP Political news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేసారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనగా బయలుదేరి సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో రూ.93 వేల కోట్లను బడ్జెట్ అనుమతి లేకుండా వైకాపా ప్రభుత్వం ఖర్చుచేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందంటూ విమర్శలు గుప్పించారు.
Also read: KTR: ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన
ఈసందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో వైకాపా ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కు చట్టబద్ధత ఉందో లేదో అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం ఉందని, లెక్కలు లేకుండా చేసిన ఖర్చుకు సంబంధించి నిధులు ఎటు వెళ్లాయని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్ కు మల్లుతున్నాయంటూ బుచ్చయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లన్నీ వైకాపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసిందని.. ఇక రాష్ట్రంలో ఏం మిగులుతుందని ఆయన అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
Also read: AP Budget: నేడే ఏపి బడ్జెట్.. మహిళలు, పిల్లలకు ప్రత్యేక కేటాయింపులు
అంకెల గారెడీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం గత రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని.. ఇప్పుడు ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించాలో తెలియని అయోమయో పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీల పదోన్నతులు ఒకే కులానికి ఇచ్చారంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని.. అయితే వైకాపా ప్రచారం అవాస్తవమని బుచ్చయ్య వివరించారు. డీఎస్పీల పదోన్నతులు అన్ని కులాలకు సక్రమంగా జరిగాయని సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి గురువారంనాడు సభలో సమాధానం ఇచ్చారని.. అసత్యాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
Also read:PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో