లోకేశ్‌ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు.. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన

జనసేన నేతలు తమదైన స్టైల్‌లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

Pawan Kalyan, Nara Lokesh

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దావోస్ పర్యటన వేళ.. ఏపీలో ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ జరుగుతోంది. నారా లోకేశ్‌ డిప్యూటీ సీఎం కావాలంటూ టీడీపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. నాలుగైదు రోజులుగా ఉప ముఖ్యమంత్రిగా లోకేశ్‌ అంటూ..టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు నేతలు అయితే లోకేశ్‌ సీఎం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే అటు జనసేన నుంచి రియాక్షన్‌ వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామని గ్లాస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తుండటం కూటమి పాలిటిక్స్‌ను ఆసక్తికరంగా మార్చేశాయి. మధ్యలో వైసీపీ ఎంట్రీ ఇచ్చి..టీడీపీ, లోకేశ్‌ను కార్నర్‌లో పెట్టే ప్రయత్నం చేస్తోంది.

టీడీపీ అధికారంలోకి వస్తే లోకేశ్‌ డిప్యూటీ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు చర్చ జరిగింది. పవన్‌తో పాటు లోకేశ్‌ను కూడా డిప్యూటీ సీఎం చేస్తారని తమ్ముళ్ళు ఎదురు చూశారు. అయితే లోకేశ్‌ను మంత్రిని చేసి పవన్‌ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి ఆదిలోని వివాదానికి తెరలేపకుండా జాగ్రత్త పడ్డారు సీఎం చంద్రబాబు.

అక్కడే రాంగ్‌ స్టెప్‌ పడిందా?
పవన్‌కు ప్రియారిటీ ఇచ్చినట్లుగా కవర్‌ చేసుకొచ్చారు. కానీ అక్కడే రాంగ్‌ స్టెప్‌ పడిందని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పవన్‌, లోకేశ్‌ ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తే అయిపోయేదని..ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదన్నది మరికొందరి ఓపీనియన్. అయితే డిప్యూటీ సీఎం పోస్ట్‌ చేపట్టే అర్హత తమ యువనేతకు ఉందంటున్నారు పలువురు టీడీపీ నేతలు. పార్టీ కోసం, కూటమి పవర్‌లోకి వచ్చేందుకు పాదయాత్ర చేయడంతో పాటు.. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు.

లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు తెరలేపారు తెలుగు తమ్ముళ్లు. దీంతో కూటమిలో కుతకుత మొదలైందని..వైసీపీ పొగ పెట్టే ప్రయత్నం చేస్తోంది. లోకేశ్‌ను ఉపముఖ్యమంత్రి చేసేందుకు అమిత్‌షా ఒప్పుకోలేదని ఓ గోలి విసిరేసింది. అసలు పవన్‌కు ఇచ్చిన శాఖలు వేరు, లోకేశ్‌ చూస్తున్న శాఖలు వేరు.

ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే కొత్తగా వచ్చేది ఏమీ ఉండదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పేరుకే డిప్యూటీ సీఎం తప్ప..ప్రోటోకాల్‌, శాఖల విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు కూటమిలో గ్యాప్ ఎక్కడిదని వైసీపీని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఫ్యాన్‌ పార్టీ నేతలు సృష్టించే గాలి వార్తలను నమ్మొద్దంటూ క్యాడర్‌కు పిలుపునిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

అయితే లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు చేసిన కామెంట్స్‌పై తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని చెప్పుకొచ్చారు.

సరికొత్త చర్చ
లోకేశ్‌ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదన్న కిరణ్ రాయల్..తాము పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. అంతే కాదు ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయొద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఈ కామెంట్స్‌తో వైసీపీ ఎత్తులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు కిరణ్‌ రాయల్‌.

అయితే ఉగాది తర్వాత మంచి ముహూర్తం చూసి లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఆయన ఎంట్రీతో పాటు లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోషన్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తన వారసుడిగా ఇప్పటికే లోకేశ్‌ను పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చారు చంద్రబాబు. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎమ్మెల్సీని చేసి లోకేశ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

అప్పటి వరకు తండ్రి చాటు కొడుకుగా..బాబు వారసుడిగా మాత్రమే ఉన్న లోకేశ్..2019లో ఓటమి తర్వాత సంక్షోభాలను అవకాశంగా మల్చుకుని పని చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి..పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. భవిష్యత్‌ నాయకుడిగా లోకేశ్‌ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారట టీడీపీ నేతలు.

లోకేశ్‌ డిప్యూటీ సీఎం అవుతారో లేదో ఇప్పటికైతే ఫుల్ క్లారిటీ లేదు కానీ..సోషల్‌ మీడియా ఎలివేషన్‌ పుణ్యమా అని కూటమి పాలిటిక్స్‌ మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఓ రకంగా లోకేశ్‌ డిప్యూటీ సీఎం అవడం జనసేన నేతలకు ఇష్టం లేదన్నట్లుగా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది.

దీనిపై జనసేన నేతలు తమదైన స్టైల్‌లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. అయితే నారాలోకేశ్‌ డిప్యూటీ సీఎం అనే ప్రచారానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్‌ పెట్టింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ హెడ్‌ ఆఫీస్‌ నుంచి నేతలకు ఆదేశాలు వెళ్లాయట. ఏ నిర్ణయమైనా కూటమి పార్టీల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని..వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని సీరియస్ అయిందట టీడీపీ అధిష్టానం.

Kaleshwaram Commission Inquiry : కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం.. ఆ శాఖ అధికారులకు నోటీసులు..