TTD Mahanadu 2025: కడపలో తెలుగుదేశం మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో తన పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ను టీడీ జనార్దన్, శ్రీపతి సతీశ్‌లు ఏర్పాటు చేశారు. తొలిసారి డిజిటల్ ఫార్మాట్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. మహానాడులో ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, వైద్య శిబిరాలను అధినేత చంద్రబాబు ప్రారంభించారు. రక్తదానం చేసి చంద్రబాబు చేతుల మీదుగా రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తొలి సర్టిఫికెట్ అందుకున్నారు. రక్తదానం చేసిన వారి వద్దకు వెళ్లి చంద్రబాబు అభినందించారు. శంఖం పూరించి మహానాడును ఘనంగా ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నేతలను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. వేదికపై తెలుగుతల్లికి గీతాలాపన చేశారు.
మృతిచెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడు సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.