అమరావతిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు: నోటీసు ఇచ్చిన కనకమేడల

  • Publish Date - November 21, 2019 / 07:19 AM IST

రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడికి అందజేసి ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు. అదే సమయంలో లోక్ సభలో గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఆపివేసినట్లు పార్లమెంట్లో చెప్పనున్నారు టీడీపీ ఎంపీలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ వ్యవస్థలో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వపరమైన నిర్మాణ పనులను జగన్ సర్కార్ నిలిపివేసిందని, దీని ప్రభావంతో అమరావతి నిర్మాణం సహా పలు ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల రంగంపై పడినట్లు టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతి నుంచి ఇప్పటివరకు అదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోందని అంటుంది టీడీపీ. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి పార్లమెంట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని ఎంపీలు తీసుకెళ్లనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యంపై కనకమేడల నోటీసులను రాజ్యసభ కార్యకలాపాల జాబితాలో లిస్టింగ్ చేసినట్లు తెలుస్తోంది.