ZPTC By Polls: జగన్ అడ్డాలో వైసీపీకి షాక్.. రెండు చోట్ల టీడీపీ విజయభేరి.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో గెలుపు..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని.. (ZPTC By Polls)

ZPTC By Polls: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పులివెందులలో ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. పులివెందుల టీడీపీ చరిత్ర సృష్టించింది. జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6వేల 33 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలుపొందారు.

పులివెందులలో మొత్తం 10వేల 601 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6వేల 716 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

వచ్చే ఎన్నికల్లో జగన్ కోటను బద్దలు కొడతాం..

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామన్న లతారెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. ప్రజలు స్వచ్చందంగా ఓటు వేసి గెలిపించారని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని లతారెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు పులివెందుల ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి సవిత అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి టీడీపీని గెలిపించిందన్న మంత్రి సవిత టీడీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణా రెడ్డి విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణా రెడ్డికి 12వేల 780 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6వేల 513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6వేల 267 ఓట్లతో గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఒకరోజు ముందే పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది:
”పులివెందులలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. పీల్చి పిప్పి చేశారు. ఎంతగానో పీడించారు. ప్రతి దాంట్లో పర్సెంటేజీలు తీసుకుంటున్నారు. దీన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. ఈసారి మనం వైసీపీకి ఓటు వేస్తే మన జీవితాలు నాశనం అవుతాయని భయపడ్డారు. మంచి ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటు వేశారు. వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత
ప్రజలు చెప్పిన సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తాం.

Also Read: చంద్రబాబుతో సోమువీర్రాజు భేటీ.. టీడీపీ, బాబు పేరు ఎత్తితే ఫైరయ్యే లీడర్‌లో ఎందుకింత మార్పు?

నాలుగు రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్లీ మొదలైంది. మేము ప్రజాస్వామ్య బద్దంగా గెలిచాం.
ధర్మానికి, అధర్మానికి యుద్ధం జరిగింది. ధర్మమే గెలిచింది. జగన్ మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో చూశాము. ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని జగన్ అన్నారు. మీరు ఎన్నికలను బాయ్ కాట్ చేయటం కాదు ప్రజలే మిమ్మల్ని బాయ్ కాట్ చేశారు జగన్. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజే పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది” అని మంత్రి సవిత అన్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారని అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నామని ఓటర్లు అన్నారంటే.. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలు గమనించాలని సీఎం చంద్రబాబు అన్నారు.