అంగన్వాడీల ధర్నాకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం

రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు.

MLC Sheikh Sabji

Teacher MLC Sheikh Sabji Died : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందారు.

అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఏలూరు నుండి భీమవరం వెళుతున్నారు. మార్గంమధ్యలో ఉండి మండలం చెరుకువాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన డ్రైవర్, గన్‌మెన్, పీఏను 108 వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

2021 మార్చిలో పీడీఎఫ్ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందారు. ప్రధాన పార్టీల మద్దతుదారులకు పోటీగా నిలబడి 1534 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ యూటీఎఫ్ లో రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగారు.

శాసనమండలి చైర్మన్, చంద్రబాబు నివాళి
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ నివాళులు అర్పించారు. షేక్ సాబ్జీ మరణం అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ (ట్విటర్)లో సంతాపం తెలిపారు. షేక్ సాబ్జీ మరణంతో శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని నారా లోకేశ్ పేర్కొన్నారు.