తెలంగాణకు హైదరాబాద్‌ ఉంది.. ఏపీకి ఏముంది? అన్న ప్రశ్నకు సినిమా రేంజ్‌లో డైలాగ్‌ చెప్పిన లోకేశ్

‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మధ్య ఓ లెజెండరీ సీన్‌ ఉంటుంది.

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాజధాని అమరావతి, రాష్ట్ర అభివృద్ధి వంటి పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

సౌతిండియాలో కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ వంటి గొప్ప నగరాలు ఉండడం వల్ల వాటివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా ప్రతికూలతలు ఉంటాయా? అని అడిగిన ప్రశ్నకు సినిమా స్టైల్‌లో ఆయన జవాబు చెప్పారు.

“కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణంలో హైదరాబాద్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ఉన్నారు. పోటీలో రాష్ట్రానికి ఆయనే అడ్వంటేజ్” అని లోకేశ్ అన్నారు. ఈ డైలాగ్‌ ఓ బాలీవుడ్‌ సినిమాలోని ఓ డైలాగ్‌ను పోలి ఉంది.

Also Read: శుభవార్త.. బంగారం ధరలు తగ్గుతాయా? అంతర్జాతీయంగా ఏం జరుగుతోందో తెలుసా?

‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మధ్య ఓ లెజెండరీ సీన్‌ ఉంటుంది. అక్కడ అమితాబ్ బచ్చన్ తన వద్ద ఉన్నసంపదను చూపుతూ.. సినిమాలో తన సోదరుడి పాత్రలో నటించిన శశి కపూర్‌ను ఓ ప్రశ్న అడుగుతాడు.

తన వద్ద ఇన్ని లగ్జరీలు ఉన్నాయని, “నీ వద్ద ఏముంది?” అని అడుగుతాడు. దానికి కపూర్ సమాధానం ఇస్తూ.. “మేరే పాస్ మా హై” (నా వద్ద అమ్మ ఉంది) అని అంటాడు. లోకేశ్ చెప్పిన సమాధానం ఈ డైలాగ్‌ను గుర్తుకు తెచ్చింది.

టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు వంటి వారి తర్వాత నారా లోకేశ్ ఉన్నారన్న అంశంపై కూడా లోకేశ్ స్పందించారు. తాను థర్డ్-జనరేషన్ పొలిటిషియన్‌గా ఏమీ ఫీల్ అవడం లేదని చెప్పారు. “నన్ను నేను తెలుగు దేశం పార్టీ కార్యకర్తగానే భావిస్తాను. నేను చంద్రబాబు నాయుడి కుమారుడికి కావడంతో 10 రెట్లు ఎక్కువే కష్టపడాల్సి వస్తుంది.

నాకున్న పెద్ద డిస్‌అడ్వంజేట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు నన్ను గమనిస్తూనే ఉంటారు” అని లోకేశ్ సరదాగా అన్నారు. తాము విశాఖపట్నంలో కొత్త డేటా సిటిని నిర్మించబోతున్నామని లోకేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఇతర అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతోందని తాము నమ్ముతున్నామని తెలిపారు.