Jaahnavi Kandula: 119 కి.మీ. వేగంతో యాక్సిడెంట్.. 100 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ జాహ్నవి.. అసలేం జరిగింది?

అమెరికా రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన తెలుగు అమ్మాయి కందుల జాహ్నవి మృతి ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Jaahnavi Kandula flung 100 feet after police car hit her says report

Jaahnavi Kandula Accident: ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలుగు అమ్మాయి (Telugu Girl) అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటే మానవత్వం మర్చిపోయిన అమెరికా పోలీసు అధికారి ఒకరు ఆమె మరణాన్ని అపహాస్యం చేశాడు. సాటి మనిషి పట్ల కనీస మర్యాద చూపాలన్న ఇంగితం మర్చిపోయి వెకిలిగా ప్రవర్తించాడు. 8 నెలల తర్వాత ఈ వ్యవహారం వెలుగుచూడటంతో తెలుగు వాళ్లతో పాటు భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతి ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జాహ్నవి మరణాన్ని అమెరికా పోలీసు అధికారి ఒకరు అపహాస్యం చేశారని వెల్లడైన నేపథ్యంలో మరికొన్ని విషయాలు తెలిశాయి. ఆంధ్రపదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి జనవరి 23న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సీటెల్‌ పోలీస్‌ అధికారి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. జాహ్నవి మరణంపై వ్యంగంగా మాట్లాడిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అమెరికాను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కోరింది.

జనవరి 23న ఏం జరిగింది?
సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న కందుల జాహ్నవి.. జనవరి 23న రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన పోలీసు కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో 100 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారని, ప్రమాద సమయంలో కారు వేగం 119 కిలోమీటర్లు ఉందని సీటెల్ టైమ్స్ వార్తా సంస్థ వెల్లడించింది. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన జాహ్నవిని సమీపంలోని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు.. కానీ ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి కారు నడిపినట్టు గుర్తించారు.

ఓవర్ స్పీడే కారణం
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రోడ్డు దాటే సమయంలో అత్యంత వేగంతో కారు దూసుకురావడంతో ప్రమాదాన్ని జాహ్నవి అంచనా వేయలేకపోయారని సీటెల్ పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్నారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడని వెల్లడించారు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని తెలిపారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు మాత్రమేనని స్థానిక మీడియా వెల్లడించింది.

పోలీసు అధికారి వెకిలి మాటలు
కాగా, సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోమవారం విడుదల చేసిన బాడీక్యామ్ ఫుటేజీలో డేనియల్ ఆర్డరర్ అనే అధికారి మాటలు రికార్డు అయ్యాయి. సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ పదవి వెలగబెడుతున్న డేనియల్.. జాహ్నవి యాక్సిడెంట్ పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదంటూ అవహేళనగా మాట్లాడాడు. “ఆమె చనిపోయింది. ఆమె సాధారణ మనిషి. ఏమైనప్పటికీ ఆమెకు 26 సంవత్సరాలు, ఆమెకు పరిమిత విలువ ఉంది” అంటూ రెచ్చిపోయాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అతడు స్పందించాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని.. డ్రగ్స్ మత్తులో ఎవరో 911కు ఫోన్ ఉంటారని అనుకుని వ్యంగ్యంగా స్పందించినట్టు వివరించాడు.

కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ
కాగా, ఈ వ్యవహారంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాసింది. జాహ్నవి మరణాన్ని తక్కువ చేసి మాట్లాడిన అమెరికా పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని కేంద్ర మంత్రిని కోరింది. ఈ అమానవీయ ఘటనపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరిపేలా అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించింది. యూఎస్‌లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. భారతదేశంలోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం జైశంకర్‌కు లేఖ రాశారు.

Also Read: జాహ్నవి కందుల మృతిపై అమెరికా పోలీసుల వ్యంగ్యం.. సీరియస్ గా స్పందించిన భారత్

కేటీఆర్ ఖండన
తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అమెరికా పోలీసుల అమానీయ వైఖరిని ఖండించారు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన జాహ్నవి మరణం విషాదమని.. ఆమె జీవితానికి డబ్బుతో వెలకట్టడం మరింత విషాదమని ట్వీట్ చేశారు.