ఏపీలో ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలిక బ్రేక్‌

break for SEC e-watch app : ఏపీలో ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ-వాచ్‌ యాప్‌ వినియోగంపై హైకోర్ట్‌ స్టేటస్‌కో ఇచ్చింది. ఈనెల 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ఆదేశించింది. యాప్‌ భద్రతకు సంబంధించిన ధ్రువపత్రం ఇంకా అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది… అది రావడానికి ఐదు రోజుల సమయం పట్టే అవకాశముందని కోర్టుకు నివేదించారు. దీంతో ఈనెల 9 వరకు ఈ-వాచ్‌ యాప్‌ను వినియోగించొద్దన్న ధర్మాసనం… తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

మరోవైపు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలున్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. మిగతా జిల్లాలకు విభిన్నంగా ఉండటంతో కమిషన్ ఈ వ్యవహారంపై ఆరా తీసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని అభినందించింది. పోలీసులు వ్యాక్సినేషన్ వేయించుకునే కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఎన్నికల విధులు నిర్వహించడానికి ముందుకు రావడంపై ఎస్‌ఈసీ అభినందనలు తెలిపింది.