Tension in Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది..కొన్నేళ్లుగా రక్తం ప్రవహిస్తోన్న కర్రల సమరానికి ఈసారి బ్రేక్ పడుతుందా? పోలీసులు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతాయా? లేదా పోలీసుల కళ్లు గప్పి కర్రలయుద్ధం మారుమోగుతుందా..? 2020, అక్టోబర్ 25వ తేదీ ఆదివారం అర్థరాత్రి ఏం జరుగబోతోంది?
దసరా అంటేనే రకరకాల సరదాలు..ఐతే అందులో కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రత్యేకతే వేరు.. అక్కడ ప్రజల తలకాయలు పగిలితేనే పండుగ జరినట్టు. విజయదశమి రోజు అక్కడ తలకాయలు పుచ్చకాయల్లా పగిలిపోతాయి. దేశమంతా విజయదశమి సంబరాల్లో ఉంటే… దేవరగట్టులో మాత్రం అక్కడి ప్రజలు కర్రల యుద్ధంలో బిజీగా ఉంటారు.
దసరా రోజున మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడతారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. తలలు పగులుతున్నా…. రక్తం కారుతున్నా… సమరం మాత్రం ఆగదు. ప్రాణాలు పోతున్నా.. అస్సలు లెక్కేచేయరు. ఈ భారమంతా దేవుడిపైనే వేస్తారు. తమకు దేవుడున్నాడు… అంతా ఆయనే చూసుకుంటాడని మొండిపట్టు పడతారు.
ఫలితంగా ఏటా ఈ ఉత్సవంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా బన్నీ ఉత్సవాన్ని నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారు. హింసాత్మకంగా మారే ఈ ఉత్సవాన్ని నిరోధించేందుకు పోలీస్ శాఖ కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. కొన్ని సంస్థలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ప్రయోజనం మాత్రం శూన్యం.
దేవరగట్టులో కర్రల యుద్ధానికి ఈసారి బ్రేక్ వేయడానికి పోలీసులు గట్టి చర్యలే తీసుకుంటున్నారు.
ఇప్పటికే అక్కడ భారీగా మోహరించారు. పైగా ఈసారి కరోనా వైరస్ గురించిన అవగాహన కూడా ఉండటంతో..పోలీసులు తమ ప్రయత్నంలో విజయవంతం అవుతామంటున్నారు. ఈసారి కల్యాణోత్సవం మాత్రమే జరిగేలా ఏర్పాట్లు చేసామన్నారు..కొండ మీదకు అనుమతించిన వారిని తప్ప.. ఇతరులను పంపించబోమని స్పష్టం చేస్తున్నారు.
ఆంక్షలతోనైనా మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవం జరగాల్సిందే అనేది స్థానికుల పట్టుదల..అందుకే పోలీస్ శాఖ విడతల వారీగా సమావేశాలు నిర్వహించినా..ప్రతి ఊరి నుంచి కొంతమందైనా వచ్చి కార్యక్రమం జరిపించుకుంటామని చెప్పారు. అయితే.. ప్రతిసారీ ఇలా పోలీసులు చెప్పిన దానికి తలొగ్గినట్లుగా కన్పించడం..తర్వాత మాత్రం తమ పని తాము కానిచ్చేసుకుంటున్నారు.
మాళ మల్లేశ్వర స్వామి ఏ ఊరికి తీసుకెళ్తే ఆ ఊరికి మంచి జరుగుతుందనే నమ్మకమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితిలో ఆదివారం రోజు రాత్రి ఏం జరుగుతుంది ? అర్ధరాత్రి కర్రలు లేస్తాయా…ఎప్పటిలాగానే వందలమంది తలపడతారా..గట్టు సమరంలో సంప్రదాయం పేరుతో రక్తం ప్రవహిస్తుందా.. అంటే… ఏం జరుగుతుందన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది.