Ramadas
Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లుగా స్టీరింగ్ కమిటీ చెబుతోంది. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం సచివాలయంలో కమిటీ భేటీ అయ్యింది.
ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. ఈ వివాదానికి నేటితో చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు.
టికెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించామని, టికెట్ల రేట్ల విషయంలో వేసిన కమిటీ అడిగినవాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని, మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నట్లు చెప్పారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు. ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చించి మేము రేట్లు ప్రభుత్వానికి సూచించామని అన్నారు.
అతిత్వరలో ఫైనల్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. ఇండస్ట్రీ కోసమే చిరంజీవి చర్చలు జరిపారని, రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వంద శాతం సీట్ల ఆక్యుఫెన్సీ అమల్లోకి వచ్చిందని, అయితే మాస్క్ మాత్రం తప్పనిసరిగా పెట్టాల్సిందేనని అన్నారు.
మళ్ళీ సమావేశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు కానీ, అనుకూలమైన వాతావరణం మాత్రం ఉందని అన్నారు. ఇదే చివరి సమావేశమని కమిటీ సభ్యులు చెబుతున్నారు.