మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు…వైసీపీ నేత హత్య కేసులో ఆయనపై అభియోగాలు

  • Publish Date - July 3, 2020 / 11:42 PM IST

మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.  తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను పోలీసులు తునిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తుని నుంచి విజయవాడకు తరలించారు.

భాస్కర్ రావు హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తమదైన శైలిలో విచారించారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కర్ రావును చంపినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కొల్లు రవీంద్రపై 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవీంద్రకు నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

కొల్లు రవీంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రాథమిక విచారణ లేకుండా ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. మాజీ మంత్రిని అరెస్టు చేయడం కక్ష్య సాధింపు చర్యే అని అన్నారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరుగలేదన్నారు. ప్రతిపక్ష నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. బీసీ నేతలను జగన్ టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.