Tirumala : తిరుమల నకిలీ టికెట్ల దందాలో ఉద్యోగుల పాత్ర

ఏడు కొండలపై దళారి దందా కొనసాగుతోంది. టీటీడీలో కొందరు అవినీతి ఉద్యోగులే ఈ దందాకు సాయం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తేల్చారు.

Fake Ticket

fake tickets scam : ఏడు కొండలపై దళారి దందా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం టికెట్ల దళారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. అయితే టీటీడీలో కొందరు అవినీతి ఉద్యోగులే ఈ దందాకు సాయం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. శ్రీవారి నకిలీ దర్శనం టిక్కెట్లకు స్కానింగ్ ఉద్యోగి సహకారం అందిస్తున్నారని.. మూడు రోజులకు ఒకసారి నకిలీ టికెట్లతో వచ్చే భక్తులకు స్కానింగ్ లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు విజిలెన్స్ టీమ్స్‌ గుర్తించాయి. మరోవైపు.. శ్రీవారి దర్శనం నకిలీ టికెట్ల రాకెట్‌లో మహారాష్ట్ర వాసుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి మహారాష్ట్రకు చెందిన పాటిల్‌ ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. శ్రీవారి దర్శనం చేయిస్తామని కల్యాణోత్సవం టిక్కెట్లను మార్ఫింగ్ చేస్తున్న ముఠా వాటిని.. శ్రీవారి దర్శనం టికెట్లు లేకుండా తిరుపతికి వచ్చే వారికి అంటగడుతున్నట్లు తెలుస్తోంది.

నకిలీ సిఫార్స్‌ లేఖలు, మార్ఫింగ్‌ చేసిన దర్శనం టికెట్లతో తిరుమల వెంకన్న భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కోవిడ్‌ కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తుండటంతో.. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. అమాయక భక్తులు సైతం.. ఈజీగా దళారుల వలలో చిక్కుతున్నారు. తిరుపతిలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. అలిపిరి బస్టాండ్‌ ఈ మోసగాళ్లకు అడ్డాగా మారింది. శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులకు సులువుగా మోసం చేస్తున్నారు. దళారులపై పోలీసులు రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తున్నా.. మాయగాళ్లు మళ్లీమళ్లీ పుట్టుకొస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్‌ బుక్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది భక్తులు ఇంకా దళారీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. మూడు వందల రూపాయల టికెట్‌ను నాలుగు వేల నాలుగు వందల రూపాయిలకు విక్రయించాడు ఓ దళారీ. తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపడంతో.. విజిలెన్స్‌ అధికారులు నిఘా పెంచారు. హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లిన భక్తులకు మార్ఫింగ్‌ చేసిన టికెట్లు దళారీ విక్రయించాడు.

ఆరు వందల రూపాయల విలువ చేసే రెండు టికెట్లును ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందలకు అంటగట్టాడు. అయితే రోజూ మూడు వందల రూపాయల దర్శనానికి కేటాయించే కోటా టికెట్ల కంటే.. ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడంతో టీటీడీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో.. నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన భక్తుల వద్ద నకిలీ టికెట్లను గుర్తించడంతో మార్ఫింగ్‌ టికెట్ల వ్యవహారంపై విచారణ చేపట్టారు విజిలెన్స్‌ అధికారులు.

కరోనా కాలంలో అక్రమార్కులు తమ తీరు మార్చుకోవట్లేదు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల కొండెక్కే భక్తులను దోచేస్తున్నారు. కరోనా నిబంధనలతో.. 300 రూపాయల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను అన్‌లైన్‌లో తక్కువ సంఖ్యలో ఇస్తోంది టీటీడీ. మరోవైపు సిఫార్సు లేఖలను సైతం తక్కువ సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు దళారులు. 15 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్, సెంట్రల్‌ బస్టాండ్‌, అలిపిరి లింక్‌ బస్టాండ్‌లు దళారుల అడ్డాగా మారింది. ఏడాదిన్నర కాలంలో కరోనా వ్యాప్తి, మధ్యలో అమలైన లాక్‌డౌన్‌, కర్ఫ్యూలతో ఉపాధి కోల్పోయిన వారంతా దళారుల అవతారమెత్తారు. మరోవైపు ఈ మధ్యకాలంలో ట్రావెల్‌ ఏజెన్సీలు కూడా ఈ దందా మొదలుపెట్టాయి.

శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన 30 మంది టాక్సీ డ్రైవర్లను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. చెన్నై కేంద్రంగా శ్రీవారి టికెట్లను బ్లాక్ మార్కెటింగ్‌ చేస్తున్న రేవతి ట్రావెల్స్‌పై ఇటీవలే పోలీసు కేసు నమోదైంది. టికెట్లు మార్ఫింగ్ చేయడం, నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించడం, కల్పిత మెసేజ్‌లను భక్తులకు వాట్సప్‌ చేయడం.. వీటన్నింటితో భక్తులకు ముంచేస్తున్నారు దళారులు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను నకిలీవి సృష్టించి…వాటిపై శ్రీవారి దర్శనాలను చేయించిన ఘనత దళారీలకు ఉంది.

తెలంగాణ మాజీ డిప్యుటీ సీఎం సిఫార్సు లేఖలు 36, అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫార్సుపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 టికెట్లను దళారులు పొందారు. ఏపీ ప్రస్తుత హోంమంత్రి, మాజీ హోంమంత్రి సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది బ్లాక్‌లో అమ్మిన ఉదంతాలూ ఉన్నాయి. ఇటీవల ఫేక్ టికెట్లు, ఫేక్‌ సిఫార్సు లెటర్లు ఎక్కువగా వెలుగుచూస్తుండడంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిఘా పెంచారు.