IPS Officers: ఆ 16 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లలో కలవరం..

వాస్తవానికి పక్కన పెట్టిన 16 మందిపై వేటు వేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.

పని లేని శిక్ష.. ఏపీలో 16 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లకు కలవరం పుట్టిస్తోందట…. ఇన్నాళ్లు వెయిటింగ్‌లో పెట్టినా చింతించని ఐపీఎస్‌లు… రోజూ ఆఫీసుకు రావాలని జారీ చేసిన మెమోతో తల పట్టుకుంటున్నారు… పనిలేకుండా ఖాళీగా కూర్చోలేమంటూ సెలవు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట… కానీ, ప్రభుత్వం ఐపీఎస్‌ల పట్ల కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోందట.

పనిఉన్నా, లేకపోయినా, రోజా ఆఫీసుకు రావాల్సిందే.. హాజరు వేసుకోవాల్సిందేనంటూ ఖరాకండీగా చెప్పేస్తుందట… దీంతో ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట ఐపీఎస్‌లు. ఎక్కువ మంది దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఐపీఎస్‌లకు సెలవు ఇస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ మారింది….

ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తున్న ప్రభుత్వం…. ఆ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో పక్కన పెట్టిన 16 మంది ఐపీఎస్‌లపై సీరియస్‌గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే పక్కన పెట్టిన ఈ 16 మందిలో ఏ ఒక్కరికీ పోస్టుంగ్‌ ఇవ్వకపోవడమే కాకుండా… ఇప్పుడు రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి హాజరు వేయించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంగుతిన్న ఐపీఎస్‌లు… సెలవు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం ఆగ్రహం చల్లారేవరకు సెలవు తీసుకోవడం బెటర్‌ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా పోస్టుంగులు లేకపోయినా, ఇంటి వద్ద, వ్యక్తిగత పనులపైనా ఎక్కువ సమయం గడిపిన ఐపీఎస్‌లకు రోజూ ఆఫీసుకు రావాలని నిబంధన చికాకు పుట్టిస్తోందంటున్నారు.

ఇది అవమానించడమేని..
పనిలేకుండా ఖాళీగా ఉంచడమంటే అవమానించడమేని భావిస్తున్న అధికారులు… ఆ అవమాన భారం నుంచి తప్పించుకునేందుకు సెలవు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో సోమవారం వరకు ఆఫీసుకు వెళ్లే అవసరం లేదని, సోమవారం హాజరు వేయించుకుని సెలవు తీసుకోవాలని భావిస్తున్నారట ఆ 16 మంది ఐపీఎస్‌లు.

ఐతే, 16 మంది ఐపీఎస్‌ల్లో ఏ ఒక్కరికీ సెలవు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్న ఐపీఎస్‌లు సెలవులో ఉన్నా, బయట ఖాళీగా ఉన్నా, కొన్ని ప్రత్యేక కేసుల్లో తలదూర్చే అవకాశం ఉందనే అనుమానంతో రోజూ డీజీపీ ఆఫీసుకు రప్పించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

పని లేని పనిష్మెంట్‌ అనుభవిస్తున్న ఐపీఎస్‌ల్లో డీజీ క్యాడర్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్‌, ఏడీజీ ఎన్‌.సంజయ్‌లు దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే వీరికి నేరుగా జీఏడీయే సెలవు మంజూరు చేయాల్సిరావడం, జీఏడీని సీఎంవో పర్యవేక్షిస్తుండటంతో సెలవు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. దీంతో దాదాపు సుదీర్ఘ సర్వీసు ఉన్న ఐపీఎస్‌లు… రిటైర్మెంట్‌ ముందు ప్రభుత్వం చర్యలపై భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చాలా సీరియస్‌గా..
ముఖ్యంగా సెలవు కోసం ప్రయత్నిస్తున్న ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో నిఘా డీజీగా పనిచేసిన ఆయన… చాలామంది టీడీపీ నేతలను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది ప్రభుత్వం. వాలంటరీ రిటైర్మెంట్‌కు ప్రయత్నించినా సర్కారు కరుణించలేదు.

సరికదా ఆంజనేయులు విషయంలో గత సర్కార్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు పట్ల అనుసరించిన విధానాన్ని ఉదహరిస్తుండటంతో…. ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతోంది. ఇక సీనియర్‌ అధికారులు పీవీ సునీల్‌కుమార్‌, ఎన్‌.సంజయ్‌ గత ప్రభుత్వంలో పెద్దలకు సన్నిహితంగా మెలిగారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపట్ల కఠినంగా ఉండాలనే సంకేతాలు పంపుతోంది ప్రభుత్వం. ఈ ఇద్దరూ దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పక్కన పెట్టిన 16 మందిపై వేటు వేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు. తగిన తగిన ఆధారాల కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికీ సాధారణ, దీర్ఘకాలిక సెలవులు ఇవ్వకుండా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరికైనా అత్యావసర సెలవు మంజూరు చేస్తే… పిలవగానే వచ్చి హాజరు కావాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఐపీఎస్‌ల వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం… కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు పంపుతోందంటున్నారు.

Also Read: వారిని వదిలేది లేదు..! పోలవరం ప్రాజెక్ట్ ఫైళ్ల దగ్ధంపై ప్రభుత్వం సీరియస్..

ట్రెండింగ్ వార్తలు