తిరుమలలో లాక్ డౌన్ : ఆదుకోరూ..స్థానికుల మొర

  • Publish Date - April 7, 2020 / 02:52 AM IST

తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్‌, ఉద్యోగుల క్వార్టర్స్‌, ఆర్‌ అండ్‌ బీ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది నివాసముంటున్నారు. అయితే వీరంతా లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. తిరుమలలో వ్యాపారం జరిగితేకానీ.. పూట గడవని వారూ ఉన్నారు. దీంతో వారిని నిత్య కష్టాలు వెంటాడుతున్నాయి. తిరుమల కొండపై నివసించే వారు సాధారణంగా తమకు అవసరమైన నిత్యావసరాలను తిరుపతి నుంచి తెచ్చుకుంటారు. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి తిరుమలలో స్థానికులను ఎవరినీ బయటకురానివ్వడం లేదు. లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదట్లో తిరుపతి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి టీటీడీ వీరికి అనుమతైతే ఇచ్చింది. కానీ తిరుపతిలోని షాపుల్లో మాత్రం నిత్యావసర సరుకులు లభించడంలేదు. దీంతో తిరుమల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుమలలో మూడు ప్రాంతాల్లో ఉంటున్న వారిని పోలీసులు ఇప్పుడు ఏమాత్రం కదలనివ్వడంలేదు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో నాలుగు రోజులు బాగానే ఉన్నా.. వీరి రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది.  దీంతో  వీరు నివాసముంటోన్న కాలనీల నుంచి వెలుపలకు కూడా రానివ్వడం లేదు. బయటకు వస్తే.. వారి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లాఠీలకు కూడా పనిచెబుతున్నారు. దీంతో తిరుమలలోని ప్రజలు ఎటూ వెళ్లలేక తాము నివసిస్తోన్న ప్రాంతాల్లోనే కాలమెళ్లదీస్తున్నారు.

తిరుమల వాసుల కష్టాలను గుర్తించిన కొంతమంది యువకులు.. వారికి అవసరమైన నిత్యావసరాలు, మందులు వారికి స్వచ్ఛంగా ఇస్తున్నారు. దీంతో స్థానికులకు కొంత ఊరట కలుగుతోంది. మరికొంత మంది యువకకులు ఓ బృందంగా ఏర్పడి.. నిత్యావసరాలు కొనుక్కోలేని వారికి విరాళాల ద్వారా బియ్యం, పప్పు, వంటనూనెతోపాటు ఇతర సరుకులు ఉచితంగా అందజేస్తున్నారు. ఆసుపత్రులకు , ఇతర పనులకు వెళ్లే వారిని పోలీసులు తిరుపతికి పంపడం లేదు.

ఏపీలో నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేయడానికి ఉదయం 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అయితే తిరుమలలో మాత్రం ఇది అమలు కావడం లేదు. దీంతో తిరుమల వాసులు బయటకొనుక్కోలేక… ఇంట్లో ఉన్నవి నిండుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.