Thopudurthi Prakash Reddy (Photo : Twitter)
Thopudurthi Prakash Reddy – Paritala Sunitha : అనంతపురము జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతపై విరుచుకుపడ్డారు. సునీతను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత వెనుకుండి.. ఆమె తమ్ముళ్లు హత్యలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పరిటాల సునీత.. తమ్ముళ్ళకు గుట్టలు, చెరువులు అప్పగించారని.. టీడీపీ హయాంలో గ్రావెల్, మట్టి తవ్వకాలకు పరిటాల కుటుంబానికి కప్పం కట్టారని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ప్రభుత్వానికి రాయల్టీ కడుతున్నారని ఆయన తెలిపారు.
”మీ తమ్ముళ్లు, బంధువులు హత్య కేసుల్లో వాయిదాలకు తిరుగుతున్నారు. పరిటాల రవీంద్ర అంటే ఎవరికీ భయం లేదు. ప్రజలకు మంచి చేస్తే గుర్తుంచుకుంటారు. మైనింగ్, ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల దొంగలు మీరు. గతంలో పరిటాల ట్యాక్స్ లు పెట్టి వసూళ్ళకు పాల్పడ్డారు. దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ మహానటి పరిటాల సునీత.
Also Read..Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్
టీడీపీ చేస్తున్న బస్ యాత్ర ఒక తుస్ యాత్ర. బస్ యాత్ర పేరుతో అసందర్భ ప్రేలాపనలు పేలొద్దు. గడువు ముగిసినా నా ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ ను కొంతమంది జులాయిలు వాడుకున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ల వినియోగంపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేయాలి. నాకు అక్రమ సంపాదన లేదు. కాంట్రాక్టులు చేసి వచ్చిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నా. ప్రజలకు సేవ చేస్తున్నా. కాబట్టే సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నా. ఇప్పటికైనా ప్రగల్బాలు మాని ప్రజలకు మంచి చేయాలనే దానిపై దృష్టి పెట్టండి” అని పరిటాల సునీతకు హితవు పలికారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.