Chandrababu Cases
Chandrababu Cases : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో పాటు ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. రేపు(అక్టోబర్ 9) అన్ని కోర్టులు తీర్పులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలంగా ఉంటాయా? అనేది హాట్ టాపిక్ గా మారింది. న్యాయస్థానాల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టుల తీర్పులపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీర్పులు..
చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో సోమవారం(అక్టోబర్ 9) అత్యంత కీలకం. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలో తీర్పులు రేపు వెలువడే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తనపై సీఐడీ నమోదు చేసిన కేసుని కొట్టివేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ ఎల్పీని రేపు విచారించి తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.(Chandrababu Cases)
Also Read : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?
సోమవారం మధ్యాహ్నంలోగా సుప్రీంకోర్టు తీర్పు..!
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నంలోగా దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదులు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో సీనియర్ మోస్ట్ లాయర్లు ఇన్వాల్వ్ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని వాదనలు..
17ఏ నిబంధనను పాటించలేదు కాబట్టి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఈ కేసుని కొట్టివేయాలని చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ నిబంధన చంద్రబాబుకి వర్తించదని, నిబంధనల ప్రకారమే చంద్రబాబుని అరెస్ట్ చేశాము, కోర్టు ముందు హాజరుపరిచాము, కోర్టు ఆయనకు జుడీషియల్ రిమాండ్ విధించింది అనే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సీఐడీ తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. రేపు(అక్టోబర్ 9) మధ్యాహ్నంలోగా తుది తీర్పుని వెలువరించే అవకాశం ఉంది.(Chandrababu Cases)
Also Read : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
ముందస్తు బెయిల్ వచ్చేనా?
ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు.. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనికి సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. ఈ బెయిల్ పిటిషన్లపై రేపు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు తీర్పులు వెలువరించే అవకాశం ఉంది. దీనిపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు కేసుల్లో మిగతా నిందితులకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు మొదటిసారిగా హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కు సంబంధించి కోర్టు నుంచి ఎలాంటి తీర్పులు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది.
ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. రేపు తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు ఇదివరకే తెలిపింది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మూడు రోజుల పాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అక్టోబర్ 9వ తేదీన సోమవారం ఉదయం 10.30గంటల తర్వాత దీనికి సంబంధించి తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్ పైనా వాదనలు పూర్తయ్యాయి. ఇక ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ వేసింది.