ఆ ముగ్గురు ఎంపీలను రాష్ట్ర బీజేపీ నమ్మడంలేదా?

  • Publish Date - February 27, 2020 / 05:19 AM IST

టీడీపీలో చక్రం తిప్పిన ఆ ముగ్గురు ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు చేరామా అని తలలు పట్టుకుంటున్నారా? లేక ఆ పార్టీ వాళ్లు వారిని నమ్మడం లేదా? అసలు పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అనే చర్చ జోరందుకుంది. టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉంటూ బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌లు ఇప్పుడు ఆ పార్టీలో అక్కరకు రాని చుట్టాల్లా తయారయ్యారనే టాక్‌ నడుస్తోంది.

తమ రాకతో ఏపీ బీజేపీ మరింత బలపడుతుందని ఉపన్యాసాలాచ్చిన ఈ నేతలిప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర పార్టీ కీలక సమావేశానికి వీరికి ఆహ్వానం అందలేందంటున్నారు. ఆ సమావేశంలోనే కాదు బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జరిగిన సమావేశంలోనూ కనిపించకపోవడంతో ఇక వారి చాప్టర్‌ క్లోజ్‌ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పార్టీ కార్యక్రమాలకు దూరంగా :
మరోవైపు రాజధాని ఇష్యూలో చంద్రబాబుకు మద్దతుగా వారు మాట్లాడుతున్నట్టుగా ఉందనే వాదనలు వినిపించాయి. దాని వల్ల రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అందుకే ఏపీ బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఆ ముగ్గురు ఎంపీలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో సుజనా, రమేశ్‌, వెంకటేశ్‌లు.. టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన తమ పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయిందేంటని బాధపడుతున్నారట. ఏపీ గురించి తీసుకునే కీలక నిర్ణయాల్లో వీరిని బీజేపీ పెద్దలు కనీసం సంప్రదించడం లేదట. దీంతో పార్టీలో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని సన్నిహితుల ముందు బాగా ఫీలవుతున్నారట. 

చంద్రబాబు ప్లాన్‌లో భాగంగానే :
పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినప్పుడు కూడా వివిధ రకాల వాదనలు వినిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్‌లో భాగంగానే సుజనా, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌లు కలిసి బీజేపీలో చేరారని వైరిపక్షాలు ఆరోపించాయి. ఆ ముగ్గురి వ్యవహార శైలి చూసిన తర్వాత పార్టీలో నమ్మకం కలగడం లేదంటున్నారు. రెండు నెలల క్రితం వరకూ కాస్త చురుకుగా కనిపించిన సుజనా చౌదరి కూడా ఇప్పుడేం మాట్లాడడం లేదు.

ఇలానే కొన్నాళ్లు ఉంటే… పదవీకాలం ముగిసిన తర్వాత ఈ నేతలకు ప్రజలు మరచిపోవడం ఖాయమంటున్నారు. ఇదే ఆందోళనలో వారున్నారని చెబుతున్నారు. కాకపోతే సైలెంట్‌గా ఉంటూనే వారు చేయాల్సింది చేస్తారనే వాదన కూడా ఉంది. చూడాలి మరి ఆ ముగ్గురు ఎంపీలు ఎలాంటి అడుగులు వేస్తారో?

Read More>>చంద్రబాబు వైజాగ్‌ టూర్‌ వెనుక అసలు ప్లాన్‌..!