Tiger : విజయనగరం జిల్లాలో పులి సంచారం-భయంతో వణికుతున్న ప్రజలు

విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేస్తోంది.

Tiger :  విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేస్తోంది. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందన్న గుబులుతో ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజుకో ప్రాంతంలో తన ఉనికి చాటుకుంటున్న పులి….ఆ ప్రాంతంలో ఉన్న మూగజీవాలపై దాడి చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు ఎస్.కోట నియోజకవర్గంలోని వేపాడ, ఎస్.కోట కొండ ప్రాంతాల్లో సంచరించిన పులి…గడచిన మూడు రోజులుగా మెంటాడ మండలంలో తిష్ట వేసింది. కొండల్లో పులి సంచరిస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఇటీవల గజపతినగరం మండలం బంగారమ్మపేట సమీపంలో ఓ వాహానదారుడికి పెద్ద పులి కంటపడింది. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంత ప్రజలకు గుబులు పట్టుకుంది. తమ ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతోందన్న సమాచారంతో భయంతో వణికిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకొన్న అటవీశాఖ అదికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. దండోరా వేయిస్తూ…ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు.

అలాగే, పులి పాదముద్రలు పరిశీలించిన అధికారులు, అవి పెద్ద పులి పాదముద్రలుగా నిర్థారించారు. ఇదే మండలం పనుకువానివలస‌లో సైతం పులి సంచారం వెలుగు చూడటంతో…ఆ ప్రాంతాన్ని అధికారులు అలెర్ట్ చేశారు. అయితే, పనుకువానివలసలో కనిపించిన పులి పాదముద్రలు, తాజాగా, గజపతినగరం మండలం బంగారమ్మపేటలో కనిపించిన పులి పాదముద్రలు ఒకే విధంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ పరిస్థితిల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు