×
Ad

Cm Chandrababu: ఘోరమైన పాపం చేసి ఎదురు దాడి చేస్తారా? దోషులను వదిలేది లేదు- తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

కరుడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారు. జరిగిన అపవిత్రాన్ని సరి చేసేందుకు దేవుడు కల్పించిన మహా సంకల్పంగా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకుంటున్నాము.

  • Published On : February 5, 2026 / 05:54 PM IST

Cm Chandrababu

  • బ్రిటీష్ వాళ్లు సైతం వేంకటేశ్వరస్వామి జోలికి రాలేదు
  • 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు?
  • లడ్డూలో కెమికల్స్ కలిసి భక్తుల ప్రాణాలకు ప్రమాదం కలగలేదంటే అది దేవుడి మహిమే

Cm Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఈ విషయంలో కూటమి నాయకులు క్షమాపణ చెప్పాల్సిందేనని వైసీపీ నేతలు చేస్తున్న డిమాండ్ పై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఎదురు దాడికి దిగారు. మేము కాదు క్షమాపణ చెప్పాల్సిందే మీరే అని తేల్చి చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామిపైనే వైసీపీ దాడికి ఒడికట్టిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. తిరుమలతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు.

10 దేవాలయాల్లో కల్తీ చేసి, మరెన్నో ఆలయాలపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇన్ని చేసి మళ్లీ బూతులు మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడతారా? అని సీరియస్ అయ్యారు. దేవుడిపై విశ్వసం లేకపోతే భక్తుల మనోభావాల జోలికి రావద్దన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్త కంఠంతో ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నో రసాయనాలు కలిసినా భక్తుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్ల లేదంటే అది దేవుడి మహిమే అని చంద్రబాబు అన్నారు.

”మహా పాపం చేసి ఎదురు దాడి చేస్తుంటే ఉపేక్షించాలా? వేంకటేశ్వర స్వామి నిస్సహాయకుడు అనుకుంటున్నారా? కరుడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారు. జరిగిన అపవిత్రాన్ని సరి చేసేందుకు దేవుడు కల్పించిన మహా సంకల్పంగా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకుంటున్నాము. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు దేవుడంటే కూడా లెక్క చేయలేదు. విషయాన్ని ఇంతటితో వదలం. బ్రిటీష్ వాళ్లు సైతం వేంకటేశ్వరస్వామి జోలికి రాలేదు. వైసీపీ వాళ్లు దేవుడితోనే పెట్టుకున్నారు. 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా ఎందుకు నివేదికను తొక్కిపెట్టారు? అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో నాకు లభించిన పునర్జన్మ దేవుడి మహిమే.

దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇప్పటివరకు ఉన్న నివేదికలన్నీ ఆ కమిషన్ ముందు ఉంచుతాం. అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారం సమర్పిస్తాం. ఇది దేవుడిచ్చిన బాధ్యత. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం” అని చంద్రబాబు అన్నారు.

Also Read: ఏడు కొండల వాడితో పెట్టుకున్న వాడు మట్టిలో కలిసిపోతాడు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు