తిరుమల శ్రీవారి దర్శనం..TTD ఉద్యోగులతో ట్రయల్ దర్శన్

  • Publish Date - June 8, 2020 / 12:21 AM IST

కంటైన్మెంట్‌ జోన్ల పరిధి మినహా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తుల దర్శనాల కోసం సిద్ధమయ్యాయి. 2020, జులై 08వ తేదీ సోమవారం నుంచి భక్తులకు దైవదర్శనాలు ప్రారంభంకానున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 24 నుంచి 2020, జులై 07వ తేదీ ఆదివారం వరకు ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆ సమయంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపులతో ఆలయాల్లో దర్శనం సోమవారం నుంచి పునఃప్రారంభంకానుంది. ఇందుకోసం అన్ని ఆలయాలు రెడీ అయ్యాయి. ఆయా ఆలయాల పరిసరాలను సోడియం హైపోక్లోరేట్‌ ద్రావణంతో శుభ్రపర్చారు. భక్తులు భౌతికదూరంగా పాటించేలా దేవాదాయ, ధర్మాదాయశాఖ, ఆలయ విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 

తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధమైంది. 80 రోజుల అనంతరం భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలగనుంది. సోమవారం దాదాపు 6 వేల మంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ దర్శన్ ప్రారంభించనున్నారు. మంగళవారం, బుధవారం కూడా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో అధికారులు ట్రయల్స్‌ నిర్వహిస్తారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఏడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి గంటకు 500 మంది భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.  దర్శన సమయ వేళలు కూడా టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నట్టు వెల్లడించింది.

శ్రీవారి దర్శనం సందర్భంగా కోవిడ్‌-19 నిబంధనలను తప్పనిసరిగా  భక్తులు పాటించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.  భక్తులకు మధ్య ఆరు అడుగుల భౌతికదూరం ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు క్యూలైన్లలో మార్కింగ్‌ చేసింది. క్యూలైన్లలతోపాటు..  లడ్డూ కౌంటర్‌,అన్నప్రసాదం కేంద్రంలోనూ మార్కింగ్‌ అధికారులు మార్కింగ్‌ చేశారు. ఈ  మేరకు ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.