ఒకే టికెట్‌తో ఒకే రోజు రెండు సార్లు తిరుమల శ్రీవారి దర్శనం.. ఇలా చేయండి..
Tirumala Tirupati Devasthanam : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి వార్షిక పుష్పయాగం సేవ రోజు ఒకే టికెట్ పై రెండుసార్లు స్వామివారి దర్శనం చేసుకొనే అవకాశం కల్పించింది.
- Harish Thanniru
- Updated on- August 9, 2026 / 11:21 AM IST
Tirumala Tirupati Devasthanam
Tirumala Tirupati Devasthanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందు ప్రతీరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అయితే, ప్రతీరోజూ ఒకేసారి స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది. అయితే, భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అరుదైన అవకాశం కల్పించనుంది. ఒకే టికెట్‌తో ఒకేరోజు రెండు సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పిస్తోంది.
Also Read : Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు మరో గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ నెల 21న విడుదల చేయనుంది. టికెట్ ధర రూ.700గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై గరిష్ఠంగా ఇద్దరు భక్తులు సేవను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం ఈ పుష్పయాగం సేవకు సుమారు వెయ్యి టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగే అనుకోని దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజుకు టికెట్ పొందిన భక్తులు స్వామివారిని రెండు సార్లు దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఉదయం 6గంటలకు సుపథం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకోవచ్చు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మరోసారి సుపథం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుష్పయాగం అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అంటే.. రూ.700 టికెట్ తో భక్తులు ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించనుంది. టీటీడీ టికెట్లు విడుదల చేసిన వెంటనే భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు వంటి కుటుంబ సభ్యులు కలిసి బుకింగ్ చేసుకోవచ్చని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేకంగా టికెట్ అవసరం ఉండదు. 12ఏళ్లు దాటిన ప్రతి భక్తుడికి ఆధార్ లేదా సంబంధిత గుర్తింపు పత్రం తప్పనిసరి.
ఈ పుష్పయాగం సేవకు టికెట్ బుక్ చేసుకునే భక్తులకు ఒక ముఖ్యమైన రూల్ కూడా ఉంది. ఈ ఏడాది నవంబర్ 16వ తేదీకు ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారు అని టీటీడీ కండీషన్ పెట్టింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, జ్యేష్టాభిషేకం, పవిత్రోత్సవం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
