తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది వీరే.. ఎవరి బలం ఎంత? అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి కూడా..

Tirupati: గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్‌ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు అన్న ఎన్టీఆర్‌ కూడా..

హిందువుల ఆధ్యాత్మిక రాజధాని… కలియుగ దైవం వెంకన్న కొలువైన పుణ్యక్షేత్రం తిరుపతి… పరమ పవిత్రమైన తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నిక అవడమంటే పూర్వజన్మ సుకృతమే… దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో రాజకీయాలు కూడా చాలా హాట్‌గా ఉంటాయి.

తిరుపతి ఎమ్మెల్యేగా గెలవాలని… ఆ ప్రాంతంలో ఉండే నాయకులు కోరుకుంటుంటారు… దేవుడి సేవే కాదు.. దేశవ్యాప్తంగా గుర్తింపు కోసం తిరుపతి ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటారు.. మరి ఈ సారి తిరుపతి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఎవరికి ఉంది….?

తిరపతి రాజకీయం చాలా హాట్‌గా మారింది. ఇక్కడి నుంచి అధికార వైసీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు, యువనేత భూమిన అభినయ్‌రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు… జనసేన తరఫున పోటీ చేస్తున్నారు.

వైసీపీ తరపున గెలిచిన శ్రీనివాసులు..
గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున గెలిచిన శ్రీనివాసులు… ఈ సారి టికెట్‌ దక్కకపోవడంతో జనసేనలో చేరారు. రాయలసీమలో ఏకైక బలిజ సామాజికవర్గ ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసులు పార్టీలో చేరిన వెంటనే తిరుపతి సీటును గిఫ్ట్‌గా ఇచ్చింది జనసేన… స్థానికేతరుడని శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని టీడీపీ, జనసేన నాయకులు వ్యతిరేకించినా… ఆరణి అనుభవం దృష్ట్యా ఆయనకే పట్టం కట్టారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.

నాటకీయంగా జనసేన టికెట్‌ దక్కించుకున్న ఆరణి శ్రీనివాసులు తనకు పోటీయే కాదంటున్నారు వైసీపీ అభ్యర్థి అభినయ్‌రెడ్డి. ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడు.. నామినేషన్లు వేసేంతవరకు ఆయన ఉంటారో ఉండరో తెలియదంటూ సెటెర్లు వేస్తూ ప్రతిపక్షన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు అభినయ్‌రెడ్డి

తొలిసారి పోటీ చేస్తున్నా… తిరుపతి డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, తండ్రి కరుణాకర్‌రెడ్డి వారసత్వంతో అభినయ్‌రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని.. ఊరు మారిందని… ప్రజలు తీరు కూడా తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు అభినయ్‌రెడ్డి.

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొంతకాలంగా వైసీపీ హవాయే నడుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతోపాటు తిరుపతి కార్పొరేషన్‌ కూడా అధికార పార్టీ గుప్పెట్లోనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అన్నంత ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ… కానీ, వైసీపీ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేలా ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి సర్దుబాట్లలో భాగంగా తిరుపతిని జనసేనకు కేటాయించారు. ఎందరో నేతలు టికెట్‌ కోసం ప్రయత్నించినా… వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన ఆరణి శ్రీనివాసులుకే పెద్దపీట వేశారు జనసేనాని పవన్‌.

తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో వ్యూహాత్మకంగా ఆరణి శ్రీనివాసులుకి టికెట్‌ ఇచ్చింది జనసేన. ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి… రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే… ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది వైసీపీ… దీంతో జనసేనలోకి చేరిపోయారు ఆరణి… ఇక తిరుపతిలో బలిజలు ఎక్కువగా ఉండటం జనసేనకు అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు.

చిరంజీవి, ఎన్టీఆర్..
గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్‌ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు అన్న ఎన్టీఆర్‌ కూడా తిరుపతి నుంచి విజయం సాధించారు. దీంతో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా సెంటిమెంట్‌ ప్రకారం తిరుపతిలో ఈ సారి గెలుస్తామనే ధీమాను ప్రదర్శిస్తున్నాయి. గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వైసీపీని ఓడిస్తానని అంటున్నారు జనసేన అభ్యర్థి శ్రీనివాసులు.

మొత్తానికి తిరుపతిలో గరం గరం రాజకీయమే నడుస్తోంది. బలిజలు ఎక్కువగా ఉండే తిరుపతిలో కేవలం ఇద్దరు మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే గెలుపొందారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఒకరు. ఇక ఇక్కడి నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది బలిజ సామాజికవర్గం వారే… గతంలో బలిజ సామాజిక వర్గం నేత వెంకటరమణ చేతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సారి విజయం ఎవరి సొంతమవుతుందనేది ఉత్కంఠగా మారింది. అభివృద్ధి, కుటుంబ బలంతో అభినయ్‌ విజయం సాధిస్తారా? కులం బలంతో ఆరణి నెగ్గుకువస్తారా? అన్నది చూడాల్సివుంది.

Also Read: పార్టీ కండువా మార్చినా టికెట్‌ దక్కని నేతలు వీరే..

ట్రెండింగ్ వార్తలు