పార్టీ కండువా మార్చినా టికెట్‌ దక్కని నేతలు వీరే..

వీరి రాజకీయ భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుందా?

పార్టీ కండువా మార్చినా టికెట్‌ దక్కని నేతలు వీరే..

Lok Sabha elections 2024

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ పార్టీలో ఉన్నవాళ్లు ఆ పార్టీలోకి.. ఆ పార్టీలో ఉన్నోళ్లు ఈ పార్టీలోకి జంప్ అయ్యారు లీడర్లు. ఇలా పార్టీలు మారి కొందరు టికెట్లు దక్కించుకుంటే మరికొందరి పరిస్థితి మాత్రం.. వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్లుగా మారిపోయింది. అధికార పార్టీలో అయితే ఈజీగా గెలువచ్చని జంప్ అయిన నేతలు.. చివరికి టికెట్ దక్కక డైలమాలో ఉన్నారు.

వెంకటేశ్ నేతకు మొండిచెయ్యే..
టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకు మొండిచెయ్యే దక్కింది. ఆయన రాజకీయ భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మరో నేత జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లేకపోతే మల్కాజిగిరి బరిలో నిలవాలనుకున్నారు.

కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. ఒకానొక సమయంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొంతు పేరు దాదాపుగా కన్ఫామ్ అయిందన్న ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలోకి చేర్చుకుని లష్కర్‌ బరిలోకి దించింది కాంగ్రెస్.

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ ఎంపీ బరిలో నిలవాలని భావించిన రాజయ్య.. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌తో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా ఇంకొకరికి షాక్ తప్పదు.

సోయం బాపూరావుకు?
బీజేపీలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు ఆదిలాబాద్ టికెట్ దక్కలేదు. ఆయనకు కాంగ్రెస్‌లో ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరిగినా కుదరలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని చూస్తున్నారు సోయం బాపూరావు. అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ దక్కుతుందని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కు టికెట్ దక్కలేదు. జలగంకే ఖమ్మం టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా.. అదే సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావుకు అవకాశం ఇచ్చింది బీజేపీ.

Lok Sabha elections 2024: తెలంగాణలో డమ్మీ రాజకీయంపై డైలాగ్‌ వార్‌..