Lok Sabha elections 2024: తెలంగాణలో డమ్మీ రాజకీయంపై డైలాగ్‌ వార్‌..

ఇంతకూ ఎవరు డమ్మీ అభ్యర్థి, ఎవరు బలమైన అభ్యర్థి అన్నది..

Lok Sabha elections 2024: తెలంగాణలో డమ్మీ రాజకీయంపై డైలాగ్‌ వార్‌..

Telangana

పార్లమెంట్‌ ఎన్నికల పోటీలో తెలంగాణలో వినిపిస్తున్న బీ-టీమ్‌ డైలాగ్‌ బిగ్‌ పొలిటికల్‌ డిబేట్‌గా మారింది.. ఆరోపణలు, విమర్శల కంటే బ్లేమ్ గేమ్ పాలిటిక్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు తమ డైలాగ్స్‌కు పదును పెడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ.. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్ధులను నిలబెడుతున్నారనేది బీఆర్‌ఎస్‌ చేస్తున్న బిగ్‌ సౌండ్‌.. పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడం.. చాలాకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్నవారికి హ్యాండివ్వడం.. కాంగ్రెస్‌ తీరుకు అద్దం పడుతుందని అంటున్నారు గులాబీ నేతలు.. ఇదంతా బీజేపీకి మేలు చేయడం కోసమేనన్నది బీఆర్‌ఎస్‌ వెర్షన్‌..

చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌, సికింద్రాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించడంలో భాగంగానే కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్ధులను బరిలోకి దింపుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని ప్రకటించింది హస్తం పార్టీ. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

రంజిత్ రెడ్డిపై ఆరోపణలు
బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేవంత్ పాత మిత్రుడు కాబట్టి పరోక్షంగా ఆయనను గెలిపించేందుకు గెలుపు అవకాశాలు లేని డమ్మీ అభ్యర్ధి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో రంజిత్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు చేవెళ్ల నుంచి ఆయననే అభ్యర్ధిగా ప్రకటించడం వెనుక బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్న స్కెచ్ ఉందని ఆరోపిస్తోంది.

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌కు మేలు చేసేందుకే.. రేవంత్‌ కేవలం మల్లురవి పేరును మాత్రమే హైకమాండ్‌కు సిఫార్సు చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గెలుపు అవకాశాలున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ ను పక్కనపెట్టడమే అందుకు ఉదాహరణ అంటున్నారు.

ఇదే క్రమంలో సికింద్రాబాద్‌ నియోజకవర్గంపై సైతం ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ బీజేపీ సిట్టింగ్‌ స్థానం కావడం, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కిషన్‌రెడ్డికి పోటీగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు టికెట్‌ ఇచ్చారు. పీజేఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన దానంకు ఇప్పుడు ఆ కుటుంబం సహకరించే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది. అటువంటిది దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్‌ ఇప్పించటం తన మిత్రుడు కిషన్‌రెడ్డిని గెలిపించేందుకేనని రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెదక్‌ లోక్‌సభ స్థానంలో
ఇక మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును బీజేపీ బరిలో దించింది. అక్కడ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగినా… నీలం మధుకు టికెట్‌ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. బలమైన అభ్యర్ధిని పెడితే ఓట్లు చీలిపోయి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని, అందుకే బలహీనమైన అభ్యర్థిని నామమాత్రంగా నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

మరోవైపు మల్కాజిగిరి స్థానం నుంచే గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఎంపీగా గెలిచారు. దీంతో మల్కాజిగిరి స్థానం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పాలి. కానీ నియోజకవర్గానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని బరిలో నిలపటం వెనుక భారీ మంత్రాంగమే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ప్రయోజనం కలిగించేందుకే పార్టీ సీనియర్లను, సమర్థులను కాదని సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారని విమర్శిస్తోంది గులాబీ పార్టీ.

బీజేపీ అభ్యర్ధులను గెలిపించేందుకా?
ఇలా చాలాచోట్ల బీజేపీ అభ్యర్ధులను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ క్యాండిడేట్స్ ను నిలబెడుతున్నారనే బీఆర్‌ఎస్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ కొట్టిపారేస్తోంది.. అసలు బీజేపీకి సహకరించేలా బీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్ధులను రంగంలోకి దింపుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ముందు నుంచి బీఆర్ఎస్‌కు, బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని చెబుతున్నారు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపిస్తున్నారు.

ఇలా డమ్మీ అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకు ఎవరు డమ్మీ అభ్యర్థి, ఎవరు బలమైన అభ్యర్థి అన్నది తేలాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.

Also Read: ఎన్నికల వేళ ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి