tirupati missing mother: తిరుపతిలో అదృశ్యమైన తల్లి, ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. తన పిల్లలను వెంటబెట్టుకుని తల్లి తమిళనాడులోని గుడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి పోలీసులు మహిళ భర్తను వెంటబెట్టుకుని తమిళనాడు వెళ్లారు. ఆదివారం(అక్టోబర్ 18,2020) నుంచి తల్లి శ్రీలేఖ, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. వారు ఎక్కడికి వెళ్లారు? ఏమయ్యారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది తెలియక కలకలం రేగింది. తల్లి, తన ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం భర్తను, బంధువులను కలవరానికి గురి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
షాపింగ్ కి వెళ్లి అదృశ్యం:
షాపింగ్‌కంటూ తన ముగ్గురు పిల్లలతో వెళ్లిన తల్లి అదృశ్యమైన సంఘటన తిరుపతిలో కలకలం రేపింది. స్థానిక కెనడీనగర్‌కు చెందిన శివకుమార్, శ్రీలేఖ దంపతులకు దీక్షితశ్రీ, తేజస్విశ్రీ, కార్తీక్ సంతానం. శ్రీలేఖ ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం రిలయన్స్ మార్ట్‌కు వెళ్లింది. షాపింగ్ తర్వాత భర్తకు కాల్ చేసి మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో భర్త కంగారుపడ్డాడు. భార్యాపిల్లల కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
https://10tv.in/bhopal-12-year-old-girl-blackmailed-raped-repeatedly-by-3-men-she-met-online-friends/
రిలయన్స్ మార్ట్ నుంచి బయటకు వచ్చాక మిస్సింగ్:
రిలయన్స్ మార్ట్ నుంచి తన ముగ్గురు పిల్లలతో శ్రీలేఖ రోడ్డుపై వెళుతున్నట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలోని కొన్ని ప్రముఖ కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. కాగా, తన భార్యతో ఎలాంటి గొడవలూ లేవని, ఎవరితో కూడా తమ కుటుంబానికి శత్రుత్వం లేదని శివకుమార్ తెలిపారు. శ్రీలేఖ తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఇదే మాట స్పష్టం చేశారు. బహుశా తన భార్యాపిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని శివకుమార్ అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో మిస్సింగ్ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి తల్లి, ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శ్రీలేఖ తన పిల్లలను తీసుకుని తమిళనాడులోని గుడికి వెళ్లడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ విషయం తెలిసి భర్త, బంధువులు, స్థానికులు సహా పోలీసులు విస్తుపోయారు.