ఈగల నుంచి కాపాడండి బాబోయ్, ఆ గ్రామంలో తినలేరు, పడుకోలేరు

  • Publish Date - October 10, 2020 / 07:33 AM IST

Tirupati Paarakalva People : ఈగలు.. ఇప్పుడీ పేరు చెబితేనే ఆ గ్రామం వణుకుతోంది. ఓ ఈగ తలచుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో ఈగ సినిమాలో చూశాం. అది సినిమా.. మరి నిజ జీవితంలోనూ ఈగలు ఓ గ్రామానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. లక్షలాది ఈగలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్టు ముడుతున్నాయి. దీంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అసలీ ఈగల గోలేంటి అనుకుంటున్నారా.. తృప్తిగా భోజనం చేయలేరు.. హాయిగా నిద్రపోలేరు.. ఆహ్లాదం కోసం ఇంటి బయటకు రాలేరు.. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. సమస్యే.



ఈగల సమస్య.. ఆషామాషీగా తీసుకోలేని ఈగల సమస్య. ఆ గ్రామంలో ఎటు చూసినా ఈగలే.. ఇది చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోగల రామచంద్రపురం మండలం పారకాల్వ గ్రామం. గ్రామంలో సుమారు 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఈగలే. ఇంటి ఆవరణ మొదలు అన్నం తినే కంచం వరకు అంతా ఈగలే. భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. పగలే అనుకుంటే.. రాత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఈగలు స్వైర విహారం చేస్తుండటంతో.. గ్రామస్తులకు కంటి మీద కునుకు కరువైంది. ఈగల బెడదతో గ్రామంలోని చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు.



ఈగల దండయాత్రతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. పారకాల్వ, రావిళ్లవారిపల్లె, అమ్మగుంట, పచ్చికాల్వ, పత్తి పుత్తూరు, దేశి కండ్రిగ తదితర సమీప గ్రామాల్లోనూ ఈగల సంచారం విపరీతంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈగల నుంచి కాపాడమని వేడుకుంటున్నారు.



పారకాల్వ గ్రామంలో ఈగల మోతకు కారణం గ్రామానికి దగ్గర్లో ఉన్న కోళ్ల ఫారాలే. గ్రామానికి అతి దగ్గర్లో వందలాది కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటి వ్యర్ధాల కారణంగానే ఈగలు గ్రామంపై దాడి చేస్తున్నాయని అంటున్నారు గ్రామస్తులు. కోళ్లఫారాల యజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అధికారులను కూడా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.



కోళ్ల ఫారాల దగ్గరకు ఎవరూ వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ కంచె వేశారు. గేట్లు పెట్టి తాళాలు వేశారు. చివరకు పశుపక్ష్యాదులను సైతం ఈగలు వదలట్లేదు. గడిచిన కొన్నేళ్లుగా గ్రామస్తులను ఈగల సమస్య నానా కష్టాలకు గురిచేస్తోంది. ఈగల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్న గ్రామస్తులు వినతిని అధికారులు ఇకనైనా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది.