Tirupati Dead Bodies : తిరుపతి పాకాల అడవిలో మృతదేహాల గుట్టు వీడింది.. అసలు కథ ఇదే.. మృతులంతా అక్కడి వారే..

తిరుపతి పాకాల అడవిలో బయటపడిన నాలుగు మృతదేహాల గుట్టు వీడింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Tirupati Dead Bodies

Tirupati Dead Bodies : తిరుపతి పాకాల అడవిలో బయటపడిన మృతదేహాలు స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలోని అడవిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మహిళ మృతదేహం కిందపడి ఉండగా.. మరో వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉంది. మృతదేహాల పక్కనే రెండు గోతులు తీసి పూడ్చిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ పక్కనే ఉన్న గోతులను తొవ్వి చూడగా.. రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఈ నాలుగు మృతదేహాలు ఎవరివి.. ఆత్మహత్య చేసుకున్నారా.. చంపేశారా.. అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా.. పోలీసుల విచారణలో అసలు గుట్టు వీడింది.

Also Read: Rajasthan : భర్తతో విడిపోయింది.. ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తితో ప్రేమాయణం.. పెళ్లికోసం 600 కి.మీ జర్నీ.. చివరికి కారులో డెడ్‌బాడీ ..

పోలీసుల విచారణలో అడవిలో వెలుగు చూసిన మృతదేహాల వివరాలు వెల్లడయ్యాయి. చనిపోయిన వారందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. జయమాల (38), కళై సెల్వన్ (37), జయమాల కుమార్తెలు దర్శిని (9), వర్షిణి (3)గా గుర్తించారు. జయమాల భర్త వెంకటేశ్, బంధువులు మంగళవారం తిరుపతి పోలీసులను సంప్రదించడంతో ఈ వివరాలు తెలిశాయి.

ఈ నలుగురు చనిపోవడానికి కారణం ఏమిటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్నం జిల్లా పి.కొంతై గ్రామం సమీపంలోని వీవోసీ నగర్‌కు చెందిన వెంకటేశ్.. కొంతకాలంగా కువైట్‌లో ఉంటున్నారు. అతనికి వివాహం అయింది. అతని భార్య జయమాల, వారికి ఇద్దరు కుమార్తులు దర్శని, వర్షిణి. వెంకటేశ్ కువైట్ వెళ్లడంతో జయమాల చిన్నమ్మ కుమారుడు కళై సెల్వన్ వారితో కలిసి ఉంటున్నాడు.

వెంకటేశ్ కువైట్‌లో సంపాదించిన సొమ్ములో దాదాపు రూ.40లక్షల వరకు భార్య జయమాలకు పంపించాడు. అయితే, ఆమె ఖాతాలో ఆ సొమ్ము లేకపోవడంతో కొంతకాలంగా వెంకటేశ్, జయమాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కువైట్ నుంచి ఇటీవల వెంకటేశ్ తిరిగొచ్చాడు.

కళైసెల్వన్‌తో కలిసి భార్య జయమాల ఫైనాన్స్ వ్యాపారం చేసి డబ్బులు పోగొట్టిందని వెంకటేశ్ ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరిపై వెంకటేశ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిసింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి జయమాల, కళైసెల్వన్ కనిపించకుండా పోయారు. దీంతో జులై 4న తిట్టచ్చేరి పోలీస్ స్టేషన్‌లో వారిపై మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.

భార్య, పిల్లల కోసం వెంకటేశ్, అతని కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఇదే సమయంలో తిరుపతి జిల్లాలోని అడవిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే, వీరు కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా..? వారిని ఎవరైనా చంపేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్, అతని కటుంబ సభ్యులు, జయమాల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వారిది ఆత్మహత్యా.. హత్యా అనే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.