డీజేతో గుండెపోటు..! డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. అమలాపురంలో తీవ్ర విషాదం..

డ్యాన్స్ చేస్తున్న వినయ్ సడెన్ గా కుప్పకూలిపోయాడు.

Tragedy Incident in Amalapuram : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజే ప్రాణం తీసింది. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా పండుగ రోజున ఈ విషాదం చోటు చేసుకుంది. కొంకాపల్లిలో దసరా వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర కొందరు యువకులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు.

వారిలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ కూడా ఉన్నాడు. డ్యాన్స్ చేస్తున్న వినయ్ సడెన్ గా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వినయ్ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరగా ఉండటం వల్ల హార్ట్ బీట్ తప్పి గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. వినయ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబసభ్యులు తెలిపారు. కేవలం డీజే బాక్సుల నుంచి వచ్చిన విపరీతమైన సౌండ్ కారణంగా అతడి గుండె ఆగిపోయిందని చెబుతున్నారు.

డీజే బాక్సుల నుంచి వచ్చే సౌండ్ చాలా ప్రమాదకరం..
ఉత్సవాలు, వేడుకలు ఏవైనా డీజేలు వాడకం సర్వ సాధారణంగా మారిపోయింది. డీజే సౌండ్ బాక్సుల ముందు కుర్రాళ్లు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు అది ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు. కానీ, అదెంత ప్రాణాంతకమో అర్థం కావడం లేదు. డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ పలువురు చనిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. వారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. చెవులకు చిల్లు పడేలా, గుండెలు అదిరేలా డీజే శబ్దాలు ఉంటున్నాయి. ఇదే ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. డీజే బాక్సుల నుంచి వచ్చే విపరీతమైన సౌండ్ తో గుండె లయ తప్పి కొట్టుకోవడం ఆగిపోతోంది. తాజాగా అమలాపురంలో ఈ తరహా విషాదమే చోటు చేసుకుంది.

గుండెపోటుకు దారితీస్తున్న డీజే సౌండ్ బాక్సులు..
ఎక్కువ సంఖ్యలో డీజే సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేయడం. పరిమితికి మించిన సౌండ్‌ పెట్టడం. దీని వల్లే కార్డియాక్ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత సమీపంలో డ్యాన్స్‌లు చేయడం చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. స్పీకర్ల నుంచే వచ్చే భారీ సౌండ్.. చెవులు, గుండెపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని గుండెపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. దాని ఫలితమే అకాల మరణం అని డాక్టర్లు అంటున్నారు.

 

Also Read : రైలు పట్టాలపై మళ్లీ గ్యాస్ సిలిండర్ కలకలం.. ఇది ఎవరి పని?