రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ కలకలం.. ఇది ఎవరి పని?

ఈ ట్రాక్ వెంట సైనికులకు సంబంధించిన ఆర్మీ వాహనాలను తరలిస్తుంటారు.

రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ కలకలం.. ఇది ఎవరి పని?

Gas Cylinder On Railway Track (Photo Credit : Google)

Updated On : October 13, 2024 / 4:51 PM IST

Gas Cylinder On Railway Track : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం తప్పింది. రూర్కీ దగ్గర రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ ను ఉంచారు. రైలు పట్టాలపై సిలిండర్ ను గమనించిన గూడ్స్ రైలు లోకో పైలెట్ అప్రమత్తం అయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపివేశారు. లందౌరా – దాందేరా స్టేషన్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

రైలు ఎమర్జెన్సీ బ్రేక్ ను వేసి ప్రమాదాన్ని తప్పించిన డ్రైవర్..
దాందేరా రైల్వే స్టేషన్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ స్టేషన్ కు సమీపంలో రైలు పట్టాలపై దుండగులు గ్యాస్ సిలిండర్ ఉంచారు. లోకో పైలెట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ ను వేసి ప్రమాదాన్ని తప్పించారు. అనంతరం రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో ముందు వచ్చే రైళ్లకు ఈ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సిలిండర్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అది ఖాళీదని నిర్ధారించారు.

ఆర్మీ వాహనాలను టార్గెట్ చేశారా?
రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే, ఈ ట్రాక్ వెంట సైనికులకు సంబంధించిన ఆర్మీ వాహనాలను తరలిస్తుంటారు. గూడ్స్ రైళ్లు కూడా సైనిక కార్యకలాపాల కోసం ఈ ట్రాక్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక గ్యాస్ సిలిండర్ ఉంచిన ప్రదేశం.. బెంగాల్ ఇంజినీర్ గ్రూప్ అండ్ సెంటర్ కు దగ్గరలోనే ఉంటుంది.

”రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ గురించి సమాచారం అందిన వెంటనే పాయింట్స్ మెన్ స్పాట్ కి వెళ్లాడు. ట్రాక్ పై ఉన్న సిలిండర్ ను గుర్తించారు. అనంతరం స్టేషన్ మాస్టర్ కస్టడీలో గ్యాస్ సిలిండర్ ను ఉంచారు. గ్యాస్ సిలిండర్ ఉంచిన ప్రాంతంలో ఒకవైపు రెసిడెన్షియల్ కాలనీ ఉంటుంది. మరోవైపు ఆర్మీ కంటోన్మెంట్ ఉంటుంది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేశారు” అని రైల్వే అధికారులు తెలిపారు.

కాన్పూర్ లో రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ కలకలం..
కాగా, సెప్టెంబర్ 22వ తేదీన ఇలాంటి తరహా ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ కనిపించడం కలకలం రేపింది. అది 5 లీటర్ల కెపాసిటీ గలది. అది ఖాళీ గ్యాస్ సిలిండర్. పట్టాలపై సిలిండర్ ను గమనించిన వెంటనే లోకో పైలెట్ బ్రేకులు వేసి రైలుని ఆపేశారు. దాంతో ప్రమాదం తప్పింది. సూరత్ లోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. దుండగులు రైల్వే ట్రాక్ పై ఉన్న ఫిష్ ప్లేట్లు, కీస్ తొలగించారు. రైలు పట్టాలు తప్పేలా కుట్ర చేసినట్లు సమాచారం.

ఇది ఎవరి పని? కుట్ర కోణం ఉందా?
రైలు పట్టాలపై తరుచూగా జరుగుతున్న ఈ ఘటనలతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఇలా చేస్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? అనేది అంతుచిక్కడం లేదు. రైలు ప్రమాదాలు జరిగేలా ఈ పనులు చేస్తున్నారా? దీని వెనుక కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులు, పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోవాలని.. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి.

Also Read : ఎవరీ బాబా సిద్ధిఖీ.. ఆయనకు అంత గుర్తింపు ఎలా వచ్చింది?