Andhrapradesh: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పరిధి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు దారుణానికి పాల్పడ్డారు. గర్భిణిపై భర్త ఎదుటే విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకున్నవారిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఉండవల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన ఆనందకుమార్ రైల్వేలో, ఆయన భార్య సునీత విజయవాడలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై అంబేద్కర్ నగర్ కు అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పోలకంపాడు వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చి వీరిని ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలు కిందపడటంతో.. సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించాడు. గర్భిణీ అయిన సునీత బైక్ ను అడ్డగించి తాళం తీసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి భార్యాభర్తలపై రాళ్లతో దాడి చేశాడు.
గర్భిణీ అయిన సునీత బాధను తట్టుకోలేక అతన్ని చెప్పుతో కొట్టడంతో మరింత ఆగ్రహించిన సదరు వ్యక్తి మరికొందరికి ఫోన్ చేశాడు. రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన యువకులతో కలిసి ఆనంద్ కుమార్, గర్భిణీ సునీతపై విచక్షణా రహితంగా దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని బెదిరించారు.
ఆనంద్ కుమార్ ను చంపేస్తామని బెదిరించారు. దీంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఫిర్యాదు మేరకు పలువురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హై సెక్యూరిటీ జోన్ గా ఉన్న ఉండవల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవటం గమనార్హం.